కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందున్న చైనా, తాజాగా డోసుల తయారీలోనూ దూసుకెళ్తోంది. వచ్చే ఏడాది చివరి నాటికి దాదాపు 60కోట్ల వ్యాక్సిన్ డోసులను సిద్ధం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సినోవాక్ వ్యాక్సిన్ సంస్థ పేర్కొంది. ఇందుకోసం ఇప్పటికే 50కోట్ల అమెరికన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించినట్లు వెల్లడించింది. తాజా పెట్టుబడులతో వ్యాక్సిన్ అమ్మకాల సామర్థ్యంతోపాటు నూతన సాంకేతికతను అభివృద్ధి చేసుకోవడంలో దోహదపడుతుందని సినోవాక్ ఆశాభావం వ్యక్తం చేసింది.
అనుమతులు పొందలేదు..
చైనాలో ఇప్పటివరకు ఐదు వ్యాక్సిన్‌లు అభివృద్ధి దశలో ఉండగా, దాదాపు 12దేశాల్లో వాటి తుదిదశ ప్రయోగాల్లో నిమగ్నమయ్యాయి. సినోవాక్ సంస్థ తయారుచేసిన వ్యాక్సిన్ తుదిదశ ప్రయోగాలను మాత్రం బ్రెజిల్, టర్కీ, ఇండోనేషియా దేశాల్లో చేపడుతోంది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ను లక్షల సంఖ్యలో చైనా ఆరోగ్య సిబ్బందితో పాటు సైనిక అధికారులకు అందజేసినట్లు సమాచారం. అత్యవసర వినియోగం కింద చైనాలో భారీ సంఖ్యలో పంపిణీ చేస్తున్నప్పటికీ, అధికారిక అనుమతులు మాత్రం పొందలేదు.