అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల(Afghanistan Taliban) అరాచక పాలన మొదలైంది. ఇప్పటికే స్వేచ్ఛ కోసం పోరాడుతున్న మహిళలను(Women Protest In Afghanistan) ఎక్కడికక్కడ అణచివేస్తున్న తాలిబన్లు.. ఆ ఆందోళనలను కవర్ చేస్తున్న జర్నలిస్టులపైనా కర్కశత్వం ప్రదర్శిస్తున్నారు. అత్యంత దారుణంగా వారిపై దాడులు చేస్తున్నారు.
తీవ్రంగా కొట్టి...
పశ్చిమ కాబుల్‌లోని కర్తే ఛార్ ప్రాంతంలో తాలిబన్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు మహిళలు బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనను అడ్డుకున్న తాలిబన్లు.. దీన్ని కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపైనా దాడులకు(Journalsits Attacked In Afghanistan) తెగబడ్డారు. అఫ్గాన్ మీడియా సంస్థ ఎట్లియాట్రోజ్‌కు చెందిన వీడియో ఎడిటర్ తాఖీ దర్యాబీ, రిపోర్టర్ నెమతుల్లా నక్దీలను తాలిబన్లు తీసుకెళ్లి వారి పట్ల అమానుషంగా ప్రవర్తించారని సదరు మీడియా సంస్థ వెల్లడించింది. వారిని తీవ్రంగా కొట్టారని తెలిపింది. ఆ తర్వాత కొంతసేపటికి వారిని విడిచిపెట్టినట్లు పేర్కొంది. శరీరంపై గాయాలతో ఉన్న జర్నలిస్టుల ఫొటోలను ఆ సంస్థ ట్విటర్ వేదికగా విడుదల చేసింది.
ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు విదేశీ మీడియా సంస్థల ప్రతినిధులు వీటిని షేర్ చేస్తూ.. తాలిబన్ల పాలనలో మానవ హక్కులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మహిళల నిరసనను కవర్ చేస్తున్న ఓ వీడియో గ్రాఫర్‌ను తాలిబన్లు అదుపులోకి తీసుకుని ముక్కు నేలకు రాయించింది. మరో జర్నలిస్టును కాలితో తన్ని అతడి వద్ద ఉన్న కెమరాను లాక్కున్నారు.