అంతర్జాతీయ ఆర్థిక సాయం పొందే విషయంలో పాకిస్థాన్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మూడు కీలక విధులను నిర్వర్తించడంలో విఫలమైనందున.. ఆ దేశం గ్రే జాబితాలోనే కొనసాగుతుందని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) గురువారం స్పష్టం చేసింది. ఉగ్రవాదులకు మనీలాండరింగ్ వ్యవహారాన్ని తనిఖీ చేయడంలో పాక్ వైపు లోపాలు ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు ప్లీనరీ సమావేశం అనంతరం వెల్లడించింది.
ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఉగ్రవాదులు, వారి అనుచరులకు వ్యతిరేకంగా పాకిస్థాన్ తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని ఎఫ్ఏటీఎఫ్ తెలిపింది. ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వారికి ఆ దేశ న్యాయస్థానాలు తగిన శిక్షలు విధించాలని పేర్కొంది. ఉగ్రవాదులపై ఆర్థిక ఆంక్షలను సమర్థవంతంగా అమలు చేయాలని, ఇందుకోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.