దక్షిణ కొరియా అధ్యక్ష పదవి రేసులో ఉన్న వ్యక్తి, సియోల్ నగర మేయర్ పార్క్-వోన్-సూన్ (64) ఆత్మహత్యకు పాల్పడ్డారు. తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన మరుసటిరోజే పార్క్ తనువు చాలించారు. నగరంలోని ఓ పర్వత ప్రాంతంలో పార్క్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం మేయర్ అధాకారిక నివాసంలో లభ్యమైన సూసైడ్ నోట్‌ను అధికారులు గుర్తించారు.
"ప్రతి ఒక్కరూ నన్ను క్షమించండి. నా సుదీర్ఘ జీవితకాలంలో నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా. అత్యంత బాధ కలిగించినందుకు నా కుటుంబసభ్యులు కూడా నన్ను క్షమించండి" అని సూసైడ్ నోట్‌లో పార్క్ పేర్కొన్నారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి విషయాలనూ నోట్‌లో మేయర్ ప్రస్తావించలేదు.
లైంగిక వేధింపుల కేసు నమోదైన తెల్లారే మేయర్ ఆత్మహత్య! పాలనా విధానం.. వ్యక్తిగత ప్రవర్తనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు సూన్. ఆయన మృత దేహం సియోల్‌కు చేరుకోగానే వేలాది మంది అభిమానులు 'సూన్ వీ లవ్ యూ' అంటూ నినాదాలు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సూన్కు సంతాపం తెలుపుతూ మెసేజ్‌లు వెల్లువెత్తుతున్నాయి.
కార్యదర్శి ఫిర్యాదు.....
సియోల్ మేయర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ మాజీ కార్యదర్శి ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యాలయ సమయంలోనే తనతో అనుచితంగా ప్రవర్తించేవారని, 2015 నుంచి మేయర్‌కు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో మేయర్ పార్క్‌పై కేసు నమోదైంది.
మీటూ అంటూ..
ప్రపంచవ్యాప్తంగా మీటూ (#MeToo) ఉద్యమంలో భాగంగా లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఎంతోమంది మహిళలు స్వయంగా వారి అనుభవాలను తెలుపుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పలుకుబడి, ఉన్నతస్థానంలో ఉన్నవారు ఎందరో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఘటనలు బయటకు వస్తూనే ఉన్నాయి. దీనిలో భాగంగా దక్షిణ కొరియాలోనూ గత రెండు సంవత్సరాలుగా మీటూ (#MeToo) ఉద్యమం ఊపందుకుంది. ఇప్పటికే లైంగిక వేధింపుల ఆరోపణలు రుజువుకావడం వల్ల ఓ గవర్నర్ స్థాయి వ్యక్తి జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
ఇదే తరహాలో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బుధవారం ఓ మహిళా సెక్రెటరీ సూన్‌పై ఫిర్యాదు చేసింది. స్వతహాగా స్త్రీవాదిగా, లింగ సమానత్వం కోసం ఓ ప్రత్యేక సలహాదారుని ఏర్పాటు చేసిన తొలి మేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు సూన్. మీటూ ఉద్యమానికి ఎన్నో సార్లు మద్దతు పలికిన సూన్ ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ఎలా ప్రవర్తిస్తారని కొందరు విమర్శకులు ప్రశ్నించారు.
కీలక నేత....
దక్షిణ కొరియాలో ప్రస్తుతం అధికారపార్టీలో కీలక నాయకుల్లో పార్క్ ఒకరు. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన సియోల్ నగరానికి గడిచిన దశాబ్దం నుంచి పార్క్-వోన్-సూన్ మేయర్‌గా సేవలందిస్తున్నారు. లింగ సమానత్వం, సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించే పార్క్ గత మూడు ఎన్నికల్లోనూ గెలుపొందారు. అంతేకాకుండా 2022లో జరిగే దేశాధ్యక్షుడి రేసులో కూడా ఉన్నారు. మానవ హక్కుల న్యాయవాదిగా పేరుగాంచిన పార్క్.. విద్యార్థి సంఘం నాయకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. అయితే, పార్క్ ఆత్మహత్యపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. శిక్ష నుంచి తప్పించుకోవడానికే పార్క్ ఇలా చేశారని కొందరు విమర్శిస్తే.. మేయర్ పార్క్ ఒక అద్బుతమైన రాజకీయ నాయకుడంటూ అక్కడి కొన్ని పత్రికలు, మద్దతుదారులు కీర్తించడం గమనార్హం.
ఇదీ చూడండి: ఆ దేశ రాజధాని నగర మేయర్ అదృశ్యం