ఉభయ కొరియాల సరిహద్దు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ సైనిక స్థావరంపై ఉత్తర కొరియా కాల్పులు జరిపిందని దక్షిణ కొరియా ఆరోపించింది. ప్రతి చర్యగా తాము కూడా కాల్పులు జరిపినట్టు పేర్కొంది.
అనారోగ్యం వార్తలకు చెక్ పెడుతూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. 20 రోజుల అనంతరం ప్రత్యక్షమైన ఒక్క రోజులో ఈ ఘటన జరగడం గమనార్హం.
'ఉత్తర కొరియాదే తప్పు...'
తాజా కాల్పులకు ఉత్తర కొరియాదే తప్పని దక్షిణ కొరియా సంయుక్త దళాధిపతి తేల్చి చెప్పారు. సరిహద్దు వెంబడి ఉన్న తమ స్థావరాలపై కిమ్ సైనికులు కాల్పులు జరిపినట్టు తెలిపారు. తాము హెచ్చరించినప్పటికీ కాల్పులు ఆగలేదని పేర్కొన్నారు. ప్రతిగా తాము కూడా రెండు రౌండ్ల కాల్పులు జరిపినట్టు స్పష్టం చేశారు.