తెలంగాణ

telangana

ETV Bharat / international

రష్యా క్షిపణుల వర్షం.. పదుల సంఖ్యలో మరణాలు - రష్యా ఉక్రెయిన్​ యుద్ధం

Russia-Ukraine crisis: ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా ముప్పేట దాడి కొనసాగిస్తోంది. కీవ్‌ సహా ప్రధాన నగరాలపై జరిగిన బాంబు దాడుల్లో సుమారు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యా దాడులతో మరియుపోల్‌ నగరంలో భీతావహ స్థితి నెలకొంది. మరింత ప్రాణ నష్టం సంభవిస్తుందన్న ఉద్దేశంతోనే విధ్వంసం సృష్టించడం లేదని రష్యా సమర్థించుకుంది.

Russia-Ukraine crisis
Russia-Ukraine crisis

By

Published : Mar 14, 2022, 10:47 PM IST

Russia-Ukraine crisis: రష్యా దాడులతో ఉక్రెయిన్‌ చిగురురుటాకులా వణికిపోతోంది. ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్‌పై బాంబులు, తుపాకులతో విరుచుకుపడుతున్న రష్యా 19వ రోజు అంతే తీవ్రత విరుచుకుపడింది. మైకోలైవ్‌ ప్రాంతంపై రష్యా జరిపిన దాడిలో 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్‌ ఆరోపించింది. కీవ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ బ్లాక్‌పై రష్యా క్షిపణి దాడి చేయగా ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరో 12 మంది గాయపడ్డారు. క్షిపణి ధాటికి అపార్ట్‌మెంటు పక్కనే ఉన్న టీవీ టవర్‌ ధ్వంసమైనట్లు ఉక్రెయిన్‌ ఆరోపించింది. కీవ్‌లోని అంటోనొవ్‌ విమాన సంస్థపై జరిగిన వైమానిక దాడిలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్‌ మీడియా పేర్కొంది. జెలెనోగోయ్‌ ప్రాంతంలోని ఓ పాఠశాల భవనంపై రష్యా సేనలు దాడి చేయగా పలువురు చిన్నారులు శిథిలాల కింద చిక్కుకొని గాయపడ్డారు. డొనెట్స్క్‌ ప్రాంతంలో ఉక్రెయిన్ బలగాలు జరిపిన దాడిలో 20 మంది మరణించినట్లు మాస్కో అనుకూల వాదులు ఆరోపించారు. అటు చెర్నోబిల్‌ అణువిద్యుత్‌ ప్లాంట్‌లో మరోమారు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్లాంట్‌కు విద్యుత్‌ను సరఫరా చేసే లైన్లపై రష్యా బలగాలు దాడి చేసినట్లు ఉక్రెయిన్‌ ఆరోపించింది.

కీవ్ శివార్లలో ఫిరంగి కాల్పుల నుంచి రక్షణ పొందుతున్న ఉక్రెయిన్ సైనికులు
బాంబు దాడితో అతలాకుతలమైన ఉక్రెయిన్​. మరియుపోల్ నగరాన్ని కమ్మేసిన దట్టమైన పొగ

ఉక్రెయిన్ ప్రధాన నగరాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రష్యా సేనలు సోమవారం రాజధాని కీవ్‌కు మరింత చేరువయ్యారు. మరియుపోల్‌, ఖర్కివ్‌, మైకోలైవ్‌, నిప్రో, చెర్నివ్‌, సుమీ నగరాలపై ఆధిపత్యం సాధించే దిశగా మాస్కో సేనలు సాగుతున్నాయి. ప్రాణ నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతోనే ఉక్రెయిన్‌లోని అతిపెద్ద నగరాలను స్వాధీనం చేసుకోవడం లేదని రష్యా పేర్కొంది. ఐతే వాటిని స్వాధీనం చేసుకునే అవకాశాలను రష్యా తోసిపుచ్చలేదు. పలు నగరాలపై పట్టు సాధించినప్పటికీ పుతిన్‌ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటున్నట్లు రష్యా సేనలు చెప్పాయి. మరోవైపు రాజధాని కీవ్‌కు సమీప ప్రాంతాలైన లూహాన్స్క్‌, తూర్పు ప్రాంత పట్టణాల్లోని పౌరులను 10 మానవ కారిడార్‌ల ద్వారా తరలిస్తున్నట్లు ఉక్రెయిన్‌ ప్రభుత్వం ప్రకటించింది. తమ దేశ గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్‌కీ నాటోకు, మరోసారి విజ్ఞప్తి చేశారు. లేకుంటే రష్యా నాటో దేశాలపై కూడా బాంబులు వేస్తుందని హెచ్చరించారు.

ఉక్రెయిన్‌లోని కీవ్‌కు పశ్చిమాన ఉన్న ఇర్పిన్ పట్టణంలో బాంబు దాడి తర్వాత మంటల్లో చిక్కుకున్న ఇల్లు
వైమానిక దాడిలో ధ్వంసమైన ఆహార నిల్వ కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఉక్రెయిన్ అగ్నిమాపక సిబ్బంది

మరోవైపు, రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత ఉక్రెయిన్ నుంచి లక్షలాది మంది శరణార్ధులుగా ఇతర దేశాలకు తరలిపోయారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఇప్పటివరకు 28 లక్షల మంది ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని దేశాన్ని వీడినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. 19 రోజుల వ్యవధిలో 17లక్షల మంది ఉక్రెనియన్లు పోలాండ్‌కు వెళ్లినట్లు వివరించింది.

మరియుపోల్‌లో ఒక అపార్ట్మెంట్ భవనంలో పేలుడు

ABOUT THE AUTHOR

...view details