మయన్మార్ కీలకనేత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైన్యం గృహనిర్బంధంలో ఉంచినట్లు సమాచారం. సూకీ సహా అధికార నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ(ఎన్ఎల్డీ) పార్టీ చైర్మన్‌ను సోమవారం ఉదయం సైన్యం అదుపులోకి తీసుకునట్లు మయన్మార్ మీడియా తెలిపింది. రాజధాని నేపిడాలో టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని పేర్కొంది. ఎన్ఎల్డీ పార్టీ నాయకులతో ఫోన్లో మాట్లాడే వీలు లేదని చెప్పింది.
అనంతరం మయన్మార్ ఇప్పుడు పూర్తిగా తమ నియంత్రణలో ఉందని సైన్యం ప్రకటించింది. ఏడాదిపాటు పాలన తమ నియంత్రణలోనే ఉంటుందని ఆర్మీ అధికారిక మీడియా ద్వారా వెల్లడించింది.
గతేడాది జరిగిన ఎన్నికల తర్వాత తొలి పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు మయన్మార్ చట్టసభ్యులు సోమవారం నేపిడాలో సమావేశం కావాల్సి ఉంది. ఈ ఎన్నికలు అక్రమంగా జరిగాయని సైనిక తిరుగబాటు తప్పదని మిలిటరీ అధికారులు కొద్ది రోజుల క్రితమే హెచ్చరించారు.