తెలంగాణ

telangana

ETV Bharat / international

నిరసనలతో హోరెత్తిన హాంగ్​కాంగ్​ వీధులు

హాంగ్​కాంగ్​లో ప్రజా నిరసనలు తారా స్థాయికి చేరుకున్నాయి. నేరపూరిత కేసుల విచారణ నిమిత్తం తమ దేశ పౌరులను చైనాకు అప్పగించాలన్న బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తాయి. ఆందోళనల నేపథ్యంలో బుధవారం జరగాల్సిన హాంగ్​కాంగ్ శాసనసభ సమావేశం వాయిదా పడింది.

నిరసనలతో హోరెత్తిన హాంగ్​కాంగ్​ వీధులు

By

Published : Jun 12, 2019, 11:24 AM IST

Updated : Jun 12, 2019, 12:00 PM IST

హాంగ్​కాంగ్​ వీధుల్లో నిరసనల హోరూ

వేలాది మంది నిరసనకారులతో హాంగ్​కాంగ్​ వీధులు దద్దరిల్లాయి. ఆందోళనకారులు- పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేల సంఖ్యలో పాల్గొన్న నిరసనకారులను అడ్డుకోవడానికి పోలీసులు బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. బ్యారికేడ్లను సమీపించిన అనంతరం గొడుగులతో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.

ఎందకీ నిరసన?

నేరాలకు పాల్పడ్డ తమ దేశస్తులను విచారణ నిమిత్తం అవసరమైతే చైనాకు అప్పగించేందుకు వీలుగా హాంగ్​కాంగ్​ ప్రభుత్వం బిల్లును తీసుకురావాలని యోచిస్తోంది. ఈ వివాదాస్పద బిల్లుపై చర్చించేందుకు బుధవారం చట్టసభ్యులు సమావేశమవ్వాలని నిశ్చయించారు. ఈ నేపథ్యంలో నిరసనలు ఉద్రిక్తమయ్యాయి. చట్టసభ్యులు సమావేశమయ్యే ప్రాంగణాన్ని చుట్టుముట్టడానికి ఆందోళనకారులు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు.

నిరసనలు హోరెత్తడం వల్ల శాసనసభ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

అంబ్రెల్లా మూమెంట్​...

వివాదాస్పద బిల్లుపై కొన్ని రోజులుగా శాంతియుత నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనల్లో ఎక్కువగా ఆ దేశ యువత పాల్గొంటోంది. ఆందోళనకారులు గొడుగులను ఆయుధాలుగా చేసుకుని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తమను అడ్డుకున్న వారికి గొడుగులు చూపిస్తున్నారు.
2014లో హాంగ్‌కాంగ్‌ ప్రజాస్వామ్య నిరసనల్లో భాగంగా నిర్వహించిన ‘'అంబ్రెల్లా మూమెంట్’' తర్వాత ఆ స్థాయిలో మళ్లీ నిరసనలు చెలరేగడం ఇదే ప్రథమం.

ఎందుకీ బిల్లు?

హాంగ్‌కాంగ్‌కు చెందిన ఓ వ్యక్తి.. గర్భవతి అయిన తన ప్రియురాలిని తీసుకుని గతేడాది ఫిబ్రవరిలో తైవాన్‌ వెళ్లాడు. అక్కడ ఆమెను అతడు హత్య చేసి, అక్కడి నుంచి తప్పించుకుని తిరిగి హాంగ్‌కాంగ్‌ వచ్చేశాడు. అందుకే అతడిని తమకు అప్పగించాలని తైవాన్‌ కోరింది. అయితే, నేరస్తుల అప్పగింతపై తైవాన్‌తో సరైన ఒప్పందాలు లేక హాంగ్‌కాంగ్ ఇందుకు నిరాకరించింది. ఈ అంశంపై ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో హాంగ్‌కాంగ్‌ ఈ బిల్లును తీసుకురావాలని ప్రయత్నిస్తోంది.

అయితే, ఇందుకు ప్రజలు ససేమీరా అంటున్నారు. హాంగ్‌కాంగ్ హక్కులకు భంగం కలుగుతుందని నిరసిస్తున్నారు. ప్రభుత్వం తేవాలని భావిస్తోన్న ఈ బిల్లు హాంగ్‌కాంగ్‌ స్వతంత్ర న్యాయవ్యవస్థను దెబ్బతీసేలా ఉందని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి- కిమ్​ మరో అందమైన లేఖ పంపారు: ట్రంప్

Last Updated : Jun 12, 2019, 12:00 PM IST

ABOUT THE AUTHOR

...view details