భారత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అటల్ సొరంగ మార్గంపై చైనా అక్కసు వెళ్లగక్కింది. యుద్ధ సమయంలో ఈ మార్గంతో భారత్‌కు ఎలాంటి ఉపయోగం ఉండదని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్.. తన కథనంలో పేర్కొంది.
భారత్‌కు ఈ మార్గం వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనదని చెబుతూనే... పొంతన లేని వివరణ ఇచ్చింది. భారత బలగాల సామర్థ్యాన్ని తక్కువ చేసేలా కథనాన్ని వడ్డించింది గ్లోబల్ టైమ్స్. చైనాకు చెందిన సైనిక నిపుణుడి పేరుతో ఈ కథనాన్ని ప్రచురించింది.
"యుద్ధం ముఖ్యంగా సైనిక చర్యల సమయంలో దీని (అటల్ టన్నెల్) వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ టన్నెల్‌ను చైనా ఆర్మీ నిరుపయోగంగా మారుస్తుంది. ఇరు దేశాల మధ్య శాంతికి కృషి చేయటమే మంచిది. భారత్ తనను తాను నిగ్రహించుకోవాలి. రెచ్చగొట్టడం మానేయాలి, ఎందుకంటే భారత్ పోరాట సామర్థ్యాన్ని పెంచే మార్గం లేదు. భారత్, చైనా మధ్య చాలా అంతరం ఉంది."