Palestine India Envoy death: పాలస్తీనాలో భారత రాయబారిగా ఉన్న ముకుల్ ఆర్య అనుమానాస్పదస్థితిలో మరణించారు. రామల్లాహ్‌లోని భారత ఎంబసీలో ఆయన విగతజీవిగా చనిపోయి కనిపించారు. ముకుల్ ఆర్య చనిపోయిన విషయాన్ని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్.జయ్‌శంకర్ ధ్రువీకరించారు. ఆయన మృతిపై జయ్‌శంకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "రమల్లాలో భారత ప్రతినిధి ముకుల్ ఆర్య మృతిచెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అతను ఎంతో తెలివైన, ప్రతిభావంతమైన అధికారి. ముకుల్ కుటుంబానికి, ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతి" అని జయ్‌శంకర్ ట్వీట్ చేశారు.
భారత రాయబారి ముకుల్ మృతిపై పాలస్తీనా అగ్రశ్రేణి నాయకత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆ దేశ విదేశీ మంత్రిత్వశాఖ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ముకుల్ మృతిచెందాడన్న వార్త తెలియగానే ఆదేశ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్, ప్రధాని మహమ్మద్ ష్టాయే భద్రత, పోలీసు, ఆరోగ్య, ఫోరెన్సిక్ అధికారులను అప్రమత్తం చేసినట్లు అక్కడి ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. వెంటనే భారత రాయబార కార్యాలయానికి చేరుకొని ఆయన మరణానికి సంబంధించి నిశిత పరిశీలన చేయాలని ఆదేశించినట్లు పేర్కొంది. ఇటువంటి క్లిష్ట, కఠిన పరిస్థితుల్లో అన్నిరకాలుగా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ముకుల్ భౌతికకాయాన్ని తరలించేందుకు భారత విదేశీమంత్రిత్వశాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అక్కడి విదేశీ మంత్రిత్వశాఖ పేర్కొంది. ముకుల్ మరణం పట్ల పాలస్తీనా విదేశాంగశాఖ మంత్రి రియాద్ అల్ మాలికీ భారత విదేశాంగ మంత్రి జయ్‌శంకర్‌కు, భారత ప్రభుత్వానికి, ఆర్య కుటుంబ సభ్యులకు తన సానుభూతి వ్యక్తం చేశారు.