రెహమానా బీబీ... దక్షిణ పాకిస్థాన్లోని లర్కానా వాసి. ఆమెకు పదేళ్ల కుమారుడు. కొద్దిరోజుల క్రితం అతడికి జ్వరం వచ్చింది. సాధారణమే అనుకుంది రెహమానా. స్థానిక వైద్యుడి దగ్గరకు వెళ్తే... మందులిచ్చి పంపించేశారు. అయితే... చుట్టుపక్కల గ్రామాల్లోని చాలా మంది పిల్లలకు హెచ్ఐవీ సోకిందని తెలియగానే ఆమె కంగారు పడింది. వైద్యపరీక్షలు చేయించింది. ఆమె అనుకున్నదే నిజమైంది. ఒక్కసారిగా గుండె పగిలింది.
"వైద్యుడు ఇతడికి కాల్పాల్ రాసిచ్చారు. అప్పటి నుంచి జ్వరం రాలేదు. తరువాత మేం మరో వైద్యుడి వద్దకు వెళ్లగా ఆయన మాకు అందరికీ పరీక్షలు చేసి ఏమీ లేదన్నారు. కానీ నా కుమారుడికి మాత్రం హెచ్ఐవీ సోకిందన్నారు. చాతి ఎక్స్-రే, టీబీ పరీక్షలు చేశారు. మరో 8 రోజుల్లో హెచ్ఐవీకి చికిత్స మొదలుపెడతారు. నా కుమారుడికి హెచ్ఐవీ సోకిందని తెలియగానే ఎంతో బాధపడ్డాం. ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాం. మా కుమారుడు తిరిగి ఆరోగ్యంగా మారాలని చూస్తున్నాం. 10ఏళ్లయినా నిండని కుమారుడి గురించి మా గుండె శోకించదా?"
-రెహమానా బీబీ, బాధితుడి తల్లి
ఈ విషాదం రెహమానా కుటుంబానికి మాత్రమే పరిమితం కాలేదు. లర్కానా చుట్టుపక్కల గ్రామాల్లోని దాదాపు 500 మందికి హెచ్ఐవీ సోకినట్లు తేలింది.