పాకిస్థాన్ - చైనా మధ్య ఆర్థిక సంబంధాలు మెరుగవుతున్న వేళ వాటి దుష్ప్రభావాలు పాక్‌లోని మైనార్టీలు, పేదరికంలో మగ్గుతున్న వారిపై పడుతోంది. క్రిస్టియన్ యువతులపై చైనీయులు పెళ్లి పేరిట పెద్ద వలే పన్నుతున్నారు. పెళ్లి చేసుకుని చైనాకు తీసుకెళ్లి వారిని వ్యభిచార కూపంలోకి నెడుతున్నారు.
తల్లిదండ్రుల పేదరికాన్ని ఆసరాగా చేసుకున్న చైనాలోని దళారులు.. పెద్ద మొత్తంలో డబ్బును ఎరగా చూపుతున్నారు. చైనా పౌరులతో పెళ్లి జరిగితే మంచి భవిష్యత్ ఉంటుందని మాయ మాటలు చెప్పి వారికి వివాహాలు జరిపిస్తున్నారు. ఒప్పుకోని యువతులను దారుణంగా హింసించి బలవంతపు పెళ్లిలు నిర్వహిస్తున్నారు. మైనార్టీల పట్ల చిన్నచూపు చూసే పాక్ ఈ విషయాన్ని పట్టించుకోవటం లేదు.
భవిష్యత్తుపై బోలెడు ఆశలతో పెళ్లి చేసుకుని చైనా వెళ్తున్న యువతులకు తొలి రోజు నుంచే నరకం మొదలవుతోంది. ఎలాంటి ఆధారాలు లేకుండా చేసి తిరిగి స్వదేశానికి వెళ్లకుండా అన్ని దార్లు మూసి వేస్తారని ఆవేదన చెందుతున్నారు. ఆ తర్వాత వారిని వ్యభిచారం రొంపిలోకి దింపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
చైనా నరక కూపం నుంచి బయట పడిన కొంత మంది మహిళలు ఎలాగోలా స్వదేశం చేరుకున్నారు.
"నా భర్త (చైనా జాతీయుడు) ప్రతి విషయంలో అవమానించే వాడు. తీవ్రంగా హింసించే వాడు. నా దగ్గర ఉన్న పాస్ పోర్టు లాక్కుని నువ్వు ఎలా నా నుంచి తప్పించుకుంటావ్ అని బాధించే వాడు. నేను నిన్ను పాకిస్థాన్‌లో కొనుగోలు చేశాను, నువ్వు నా ఆస్తివి. నిన్ను ఏదైనా చేసే అధికారం నాకుంది అని హింసించే వాడు. ఓ రోజు నా భర్త నన్ను బలవంతంగా అత్యాచారం చేశాడు. ఆ తర్వాత రోజు ఒక కొత్త వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చాడు. ఇద్దరు మద్యం తాగి నన్ను బలాత్కరించారు. ఇలా రోజూ నా భర్త ఇద్దరు ముగ్గురు కొత్త వ్యక్తులతో వచ్చి వారితో శృంగారం చేయమని బెదిరించేవాడు"