దాయాది దేశాల మధ్య ఆధ్యాత్మిక వారధిగా చెబుతున్న కర్తార్‌పుర్ నడవాను నవంబర్ 9న ప్రారంభిస్తామని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించారు. సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ 550వ జయంతి (నవంబర్ 12) నాటికి నడవాను తెరుస్తారా అన్న ప్రశ్నకు ఇమ్రాన్ ఇలా స్పందించారు.
"కర్తార్‌పుర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు చివరిదశలో ఉన్నాయి. కనుక 2019 నవంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కుల కోసం కర్తార్‌పుర్ నడవాను తెరిచేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉంది.
ప్రపంచంలోని అతిపెద్ద గురుద్వారాను భారత్, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు సందర్శిస్తారు. ఇది సిక్కులకు ప్రధాన మత కేంద్రంగా మారుతుంది. స్థానిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తుంది. ప్రయాణ, ఆతిథ్య రంగాల వల్ల దేశానికి విదేశీ మారకద్రవ్యం చేకూరుతుంది."
- ఇమ్రాన్‌ఖాన్, పాక్ ప్రధాన మంత్రి
మన్మోహన్ సింగ్ వెళ్తారు కానీ...
కర్తార్‌పుర్ నడవా ప్రారంభోత్సవానికి భారత మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ హాజరుకారని తెలిసింది. అయితే... ఆయన ఓ సాధారణ భక్తుడిలా గురుద్వారా సందర్శనకు వెళ్తారని ఆయనకు సన్నిహితంగా ఉండే వర్గాలు తెలిపాయి. నడవా ప్రారంభోత్సవానికి రావాలని పాక్ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషీ రాసిన లేఖకు మన్మోహన్ ఈమేరకు బదులిచ్చినట్లు వెల్లడించాయి.
పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నేతృత్వంలోని సిక్కుల బృందంలో మన్మోహన్ ఉంటారని తెలిసింది. ఆ బృందం కర్తార్‌పుర్‌లో ప్రార్థనలు చేసి, అదే రోజు భారత్‌కు తిరిగి వస్తుంది.