తెలంగాణ

telangana

ETV Bharat / international

తాలిబన్లకు సాయం చేస్తూ పాక్​ కొత్త కుట్రలు! - అఫ్గాన్​

అఫ్గానిస్థాన్‌లో సైన్యం-తాలిబన్ల మధ్య జరుగుతున్న సంఘర్షణలో పాకిస్థాన్‌ కుట్ర బుద్ధి బయటపడింది. తాలిబన్లకు మద్దతుగా ఘర్షణల్లో ప్రత్యక్షంగా పాల్గొనటం తప్ప ఉగ్రవాదులకు ఎంత మేలు చేయాలో అంతకంటే ఎక్కువే చేస్తోంది. అంతర్జాతీయ నిబంధనలను బూచిగా చూపి పొరుగుదేశం సేనలను బెదిరిస్తోంది. అఫ్గాన్‌పై తాలిబన్లు తిరిగి పట్టు సాధించేందుకు పాకిస్థాన్‌ చేతనైనంత సాయం చేస్తోంది.

Pakistan, Taliban
పాకిస్థాన్​, తాలిబన్లు

By

Published : Jul 16, 2021, 7:07 PM IST

అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా, నాటో దళాల ఉపసంహరణతో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఆ దేశ సైన్యం, తాలిబన్ల మధ్య భీకరపోరు జరుగుతోంది. ఈ క్రమంలోనే.. పాకిస్థాన్‌ వక్రబుద్ధి బయటపడింది. ఉగ్రమూకల పక్షాన చేరి వారికి అండగా నిలుస్తోంది. తాలిబన్లపై అఫ్గాన్‌ సైన్యం వైమానిక దాడులు చేయకుండా పాకిస్థాన్‌ మిలిటరీ అడ్డుకుంది. దక్షిణ కాందహార్‌లోని కీలక మార్కెట్‌ ప్రాంతమైన స్పిన్‌ బోల్డాక్‌ నుంచి తాలిబన్లను తరిమికొట్టే ప్రయత్నాలను అడ్డుకుంది. తాలిబన్లపై వైమానిక దాడులు చేస్తే తమ సైన్యం ఎదురుదాడి చేస్తుందని పాకిస్థాన్‌ వాయుసేన హెచ్చరిక జారీచేసినట్లు అఫ్గాస్థాన్‌ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలెహ్ ట్వీట్‌ చేశారు. పాకిస్థాన్‌ సైన్యం కొన్నిప్రాంతాల్లో తాలిబన్లకు వైమానిక సాయం అందిస్తున్నట్లు ఆరోపించారు.

పాక్​ బెదిరింపులు..

స్పిన్‌ బొల్డాక్‌ ప్రాంతానికి అఫ్గాన్​ యుద్ధ విమానాలు 10కిలోమీటర్ల దూరంలో ఉండగా వెనక్కి వెళ్లిపోవాలని పొరుగు దేశం సేనలను బెదిరించింది పాకిస్థాన్‌. దాడులను ఆపకుంటే క్షిపణి దాడులు చేస్తామని హెచ్చరించినట్లు అఫ్గాన్​ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అఫ్గాన్​-పాకిస్థాన్‌ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఉన్న దక్షిణ కాందహార్‌లోని స్పిన్‌ బొల్డాక్‌ ప్రాంతాన్ని నియంత్రణలోకి తీసుకున్న తాలిబన్లపై దాడిచేసేందుకు అఫ్గాన్​ సైన్యం 3 ఏ-29 యుద్ధవిమానాలను మోహరించింది. ముందురోజే ఈ సమస్యాత్మక సరిహద్దు ప్రాంతంపై తాలిబన్లు పట్టు సాధించారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం సైనిక లక్ష్యాల దృష్ట్యా అంతర్జాతీయ సరిహద్దుకు 18 కిలోమీటర్లలోపు యుద్ధ విమానాలను మోహరించకూడదంటూ పాకిస్థాన్‌ మిలిటరీ అఫ్గాన్​ సేనలను బెదిరించింది.

అఫ్గాన్‌ సేనల దాడిలో గాయపడిన తాలిబన్లకు పాకిస్థాన్‌ వైద్య సాయం అందిస్తోంది. అఫ్గాన్​ సరిహద్దులోని పాకిస్థాన్‌ ఆస్పత్రులన్నీ తాలిబన్లతో నిండిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

సల్మా డ్యాం విధ్వంసానికి కుట్ర..

అంతకుముందురోజే భారత్‌-అఫ్గాన్‌ స్నేహానికి గుర్తుగా నిర్మించిన సల్మా డ్యాంపై తాలిబన్లు మోర్టార్‌ దాడులు చేసినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. 2016 జూన్‌ 4న సల్మా డ్యాంను ప్రధాని మోదీ, అఫ్గాన్​ అధ్యక్షుడు అశ్రఫ్‌ ఘనీ ప్రారంభించారు. కాబూల్‌లోని అఫ్గాన్​ పార్లమెంటుతోపాటు సల్మా డ్యాంను భారత్‌ నిర్మించింది. ఈ డ్యాం విధ్వంసానికి కుట్ర చేశాడన్న అభియోగాలపై భద్రతాదళాలు పాకిస్థాన్‌ పౌరుడ్ని అరెస్ట్‌ చేసినట్లు అఫ్గాన్​ మీడియాలో కథనాలు వచ్చాయి.

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లకు పరోక్షంగా మద్దతిస్తున్న పాకిస్థాన్‌ తీరును అంతర్జాతీయ సమాజం నిశితంగా పరిశీలిస్తోంది.

(రచయిత- సంజీవ్​ కుమార్ బారువా)

ఇదీ చూడండి:రెచ్చిపోతున్న తాలిబన్లు- ప్రాణభయంతో అఫ్గాన్​ మహిళలు!

ABOUT THE AUTHOR

...view details