పాకిస్థాన్ మరోమారు తన వక్రబుద్ధిని బయటపెట్టింది. కశ్మీర్ అంశంపై మళ్లీ జోక్యం చేసుకుంది. ఈసారి ఏకంగా భారత ప్రభుత్వంపై విషం కక్కింది. కశ్మీర్లో భారత ప్రభుత్వం మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందంటూ.. పలు పత్రాలను విడుదల చేసింది.
ఇస్లామాబాద్‌లో జరిగిన మీడియా కాన్ఫరెన్స్‌లో 131పేజీలతో కూడిన ఈ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషీ, జాతీయ భద్రతా సలహాదారు యూసఫ్. భారత నిజస్వరూపాన్ని బయటపెట్టేందుకు నిర్ణయించుకున్నట్టు ఖురేషీ ఈ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.
"ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ గొప్పలు చెప్పుకుంటోంది. కానీ భారత ప్రభుత్వం నిజస్వరూపాన్ని బయటపెట్టాలని మేము నిర్ణయించుకున్నాము. అందుకే కశ్మీర్‌పై ఈ పత్రాలను రూపొందించాము. 26అంతర్జాతీయ, 14 పాకిస్థాన్ మీడియా రిపోర్టుల నుంచి సేకరించిన 113 ఘటనలను ఇందులో పొందుపరిచాము. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నట్టు ఇవి స్పష్టం చేస్తాయి. ఐరాసతో పాటు అంతర్జాతీయ సమాజానికి ఈ పత్రాలను పంపిస్తాము."