తెలంగాణ

telangana

ETV Bharat / international

Taliban: 'పాకిస్థాన్ మా రెండో ఇల్లు'- తాలిబన్ల ప్రకటన

పాకిస్థాన్​కు, తాలిబన్లకు మధ్య ఉన్న అనుబంధం మరోసారి బయటపడింది. పాకిస్థాన్‌ తమకు రెండో ఇల్లు వంటిదని తాలిబన్‌ ప్రతినిధి జైబుల్లా ముజాహిద్‌ అన్నారు. మతం విషయానికి వస్తే పాక్‌-అఫ్గాన్‌లు సహజ మిత్రులని పేర్కొన్నారు.

Pakistan is second home for Taliban
తాలిబన్ల రెండో ఇల్లు పాకిస్థాన్‌

By

Published : Aug 26, 2021, 10:52 PM IST

'పాకిస్థాన్‌ మా తాలిబన్లకు రెండో ఇల్లు వంటిది. ఆ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏ గ్రూపు మా భూభాగాన్ని వినియోగించుకోనీయం' అని తాలిబన్‌ ప్రతినిధి జైబుల్లా ముజాహిద్‌ పేర్కొన్నారు. పాక్‌-అఫ్గాన్‌లు సరిహద్దులు పంచుకుంటాయన్నారు. మతం విషయానికి వస్తే మా రెండు దేశాలు సహజ మిత్రులని తెలిపారు. భవిష్యత్తులో పాక్‌తో సంబంధాలు మెరుగుపర్చుకొనే అంశంపై మేము దృష్టిపెడతాము.

అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంలో పాక్‌ పాత్ర ఏమాత్రం లేదని జైబుల్లా పేర్కొన్నారు. ఆ దేశం మా అంతర్గత వ్యవహారాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని తెలిపారు. పాకిస్థాన్‌కు చెందిన ఏఆర్‌వై న్యూస్‌తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో సహా ప్రపంచంలోని అన్ని దేశాలతో అఫ్గానిస్థాన్‌ మంచి సంబంధాలు కోరుకుంటోందన్నారు. అఫ్గాన్‌ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే భారత్‌ తన విధానాన్ని నిర్ణయించుకొంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. అఫ్గాన్‌ గడ్డపై ఐసిస్‌ లేదని జైబుల్లా తేల్చి చెప్పారు. ఇక భారత్‌-పాక్‌ల మధ్య ఉన్న సమస్యలు వారు చర్చించుకొని పరిష్కరించుకోవాలన్నారు.

టీటీపీతో భయం..

అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించారని పాక్‌ సంతోషించినా.. తెహ్రీక్‌ ఈ తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) ఎక్కడ పుంజుకొంటుందో అని భయపడుతోంది. పాకిస్థాన్‌లో ఇది అత్యంత ప్రమాదకరమైన ఉగ్రసంస్థగా దీనికి గుర్తింపు ఉంది. ఈ సంస్థ అక్కడ పలు భారీ దాడులకు కారణమైంది. 2011లో కరాచీలో అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి చేసింది. 2014లో ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌పై దాడి చేసి పిల్లలతో సహా 150 మందిని చంపేసింది.

2007లో ఈ సంస్థను ఖైబర్‌ పక్తూన్‌క్వాలో బైతుల్లా మెహ్‌సూద్‌ స్థాపించారు. పాకిస్థాన్‌ మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో హత్య తర్వాత వేగంగా పుంజుకొంది. మెహసూద్‌కు అఫ్గాన్‌ తాలిబన్‌, అల్‌ఖైదాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2009నాటికి ఈ సంస్థ పుంజుకొంటున్న సమయంలో డ్రోన్‌ దాడిలో చనిపోయాడు. అతని వారసుడు హకీముల్లా మెహసూద్‌ కూడా 2013లో ఒక డ్రోన్‌ దాడిలో చనిపోయాడు. ఆ తర్వాత టీటీపీ వర్గాలుగా విడిపోయింది. దానికి ముల్లా ఫజలుల్లాను నాయకుడిగా ఎంచుకొన్నారు. అదే సమయంలో పాకిస్థాన్‌ భద్రతా దళాలు దాడులను పెంచాయి. పాక్‌కు అమెరికా నుంచి డ్రోన్ల రూపంలో సాయం కూడా అందింది. ఈ ఆపరేషన్‌కు జెర్బ్‌-ఇ-అజబ్‌ అనే పేరుపెట్టారు. దీంతో ఆ బృందం బలహీనపడింది. మధ్యశ్రేణి నాయకులు అఫ్గానిస్థాన్‌కు పారిపోయారు.

ఇదీ చూడండి:ప్రభుత్వ ఏర్పాటు దిశగా తాలిబన్లు- పంజ్​షేర్ నేతకు చోటు!

ABOUT THE AUTHOR

...view details