తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​తో వాణిజ్య సంబంధాలు రద్దు! పాక్​ నిర్ణయం

ఆర్టికల్​ 370 రద్దుపై అభ్యంతరాలు లేవనెత్తిన దాయాది పాకిస్థాన్ సర్కారు భారత్​తో సంబంధాలు తెగతెంపులు చేసుకునే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాక్​లోని భారత హైకమిషనర్​ అజయ్ బిసారియాను బహిష్కరించింది. పాక్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్ నేతృత్వంలో సమావేశమైన జాతీయ భద్రతా మండలి(ఎన్​ఎస్​ఏ).. భారత్​తో దౌత్య సంబంధాలు కుదించడం సహా... ద్వైపాక్షిక ఒప్పందాలను పునఃసమీక్షించనున్నట్లు ప్రకటించింది.

భారత్​తో 'దౌత్య' తెగతెంపులకు పాక్​ నిర్ణయం

By

Published : Aug 8, 2019, 5:35 AM IST

Updated : Aug 8, 2019, 1:33 PM IST

భారత్​తో వాణిజ్య సంబంధాలు రద్దు! పాక్​ నిర్ణయం

జమ్ము,కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన పాకిస్థాన్... భారత్​తో సంబంధాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అధికరణ 370 రద్దు అనంతరం.. భారత్​పై గుర్రుగా ఉంది పాకిస్థాన్​. వారం వ్యవధిలోనే రెండు సార్లు జాతీయ భద్రతా మండలి భేటీ నిర్వహించింది.

దౌత్యానికి సంబంధించి...

దౌత్య వ్యవహారాలకు సంబంధించి తమ దేశంలోని భారత హైకమిషనర్ అజయ్ బిసారియాను బహిష్కరించింది. వచ్చే నెలలో బాధ్యతలు చేపట్టాల్సి ఉన్న పాకిస్తాన్‌ హైకమిషనర్‌ను భారత్‌కు పంపకూడదని నిర్ణయం తీసుకుంది. భారత్‌తో దౌత్య సంబంధాలను పునఃసమీక్షించనున్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి:సుష్మకు యావత్​ భారతం కన్నీటి వీడ్కోలు

వాణిజ్యంపై...

కశ్మీర్ అంశంపై అత్యవసరంగా సమావేశమైన జాతీయ భద్రతా కమిటీ భారత్​తో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు నిలిపేయాలని మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై విస్తృతంగా చర్చించారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలు

పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 14ను జమ్ముకశ్మీర్​ వాసులకు సంఘీభావ దినంగా పాటించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. భారత స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15ను చీకటి దినంగా పాటించాలని తీర్మానించారు.

నాలుగైదు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో భారత్​తో చేసుకున్న అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలపై పునఃసమీక్ష చేపట్టాలని నిర్ణయించారు. ఇదే సమయంలో జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దుచేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లాలనీ పాకిస్థాన్ జాతీయ భద్రతా కమిటీ తీర్మానించినట్లు ఇమ్రాన్​ సర్కార్ ఓ ప్రకటనలో తెలిపింది.

బ్రిటన్​ ప్రధానితో సంప్రదింపులు..

రెండు రోజుల పాటు సమావేశమైన పాక్​ సంయుక్త పార్లమెంటు జమ్ముకశ్మీర్​ పునర్విభజన సహా 370 రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తూ రూపొందించిన తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇదే అంశంపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​.. బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​, సౌదీ యువరాజు మహ్మద్​ బిన్​ సల్మాన్​తో ఫోన్​ ద్వారా సంప్రదింపులు జరిపారు. భారత్​ మాత్రం జమ్ముకశ్మీర్​ తమ అంతర్గత విషయమని తేల్చిచెప్పింది.

Last Updated : Aug 8, 2019, 1:33 PM IST

ABOUT THE AUTHOR

...view details