భారత్ అంతర్గత విషయాల్లో పాకిస్థాన్ మరోసారి తలదూర్చింది. భారత్లోని ముస్లింలపై కపట సానుభూతిని ప్రదర్శించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభించడాన్ని తప్పుబడుతూ అనవసర వ్యాఖ్యలు చేసింది. బాబ్రీ మసీదు ఉన్న ప్రదేశంలో మందిరం నిర్మించడాన్ని బట్టి భారత్లో ముస్లింలు ఎంత అట్టడుగు స్థాయిలో జీవిస్తున్నారనే విషయం అర్థమవుతుందని వ్యాఖ్యానించింది.
ఈ మేరకు పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ప్రపంచం మొత్తం కరోనాపై పోరాడుతుంటే ఆర్ఎస్ఎస్-భాజపా సంయుక్తంగా హిందుత్వ అజెండాను విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పుకొచ్చింది. రామమందిర నిర్మాణం ఈ అజెండాలో మరో ముందడుగని.. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టికలను ప్రస్తావిస్తూ మొసలి కన్నీరు కార్చింది.