పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఆర్మీ సైనిక పాఠశాలలో 2014లో మారణహోమం జరిగింది. పాకిస్థాన్ తాలిబన్లుగా పిలువబడే తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ముష్కరులు జరిపినట్లు భావిస్తోన్న ఈ దాడితో యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. ఈ కేసు విచారణలో భాగంగా పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నేడు సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై అక్కడి సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. దాదాపు 150మంది చిన్నారుల నరమేధానికి పాల్పడిన వారితో ఎందుకు సంప్రదింపులు జరుపుతున్నారంటూ ప్రధానమంత్రిని నిలదీసింది.
పాకిస్థాన్ పెషావర్‌లో 2014లో ఆరుగురు ముష్కరులు చేసిన మారణహోమంలో 147మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 132 మంది చిన్నారులే. ఈ దారుణం చోటుచేసుకొని ఏడేళ్లు కావస్తోన్నా దీనికి కారణమైన వారిని మాత్రం పాక్ ప్రభుత్వం ఇప్పటికీ కనిపెట్టలేకపోయింది. దీంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ కేసును పాకిస్థాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గుల్జార్ అహ్మద్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ఇందులో భాగంగా గతనెల ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏకంగా ప్రధానమంత్రి నేరుగా న్యాయస్థానానికి హాజరై సమాధానమివ్వాలంటూ సమన్లు జారీ చేసింది. దీంతో విషయం తెలుసుకున్న పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్.. ఆదేశాలు అందిన కొన్ని గంటల్లోనే సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. అనంతరం పెషావర్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ (ఏపీఎస్) ఘటనపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను కోర్టుకు తెలియజేయాలని త్రిసభ్య ధర్మాసనం ప్రధానమంత్రిని అడిగింది. ఈ సందర్భంగా ఆయనపై త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.
పరిహారం కాదు.. బాధితుల ప్రశ్నకు బదులేది..?
ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబాలకు ఇప్పటికే పరిహారం అందించామని.. అప్పటి మారణకాండ తర్వాత నేషనల్ యాక్షన్ ప్లాన్‌ను కూడా తీసుకువచ్చామని ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ కోర్టుకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్.. బాధిత తల్లిదండ్రులు ప్రభుత్వం నుంచి కోరుకుంటోంది పరిహారం కాదన్నారు. (ఆరోజు) భద్రతా వ్యవస్థ ఎక్కడ అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు..? వీటిపై నెలక్రితం కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కనీస చర్యలు కూడా తీసుకోలేదని చీఫ్ జస్టిస్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
మారణహోమంలో భాగస్వామ్యులైన వారిపై చర్యలు తీసుకోకపోవడంతో పాటు.. అక్టోబర్ 20న కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని చీఫ్ జస్టిస్ తీవ్రంగా తప్పుబట్టారు.
ప్రధానమంత్రికి చురకలు..
అంతకుముందు బాధిత చిన్నారుల తల్లిదండ్రులను కలిశానని.. భవిష్యత్తులోనూ బాధిత కుటుంబాలకు బాసటగా నిలుస్తానని ఇమ్రాన్ ఖాన్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇంతటితో ఆగకుండా '80వేల మంది ప్రజలు ఎలా మరణించారో తెలుసుకోండి. పాకిస్థాన్‌లో 480 డ్రోన్ దాడులకు బాధ్యులెవరో తెలుసుకోండి' అని ధర్మాసనం ముందు వ్యాఖ్యానించారు. దీనికి బదులిచ్చిన చీఫ్ జస్టిస్.. 'ఈ విషయాలు తెలుసుకోవాల్సింది మీరు. మీరు ప్రధానమంత్రి. ఇలాంటి ప్రశ్నలకు ఓ ప్రధానమంత్రిగా మీ దగ్గర సమాధానం ఉండాలి' అంటూ ఇమ్రాన్ ఖాన్‌కు చురకలు అంటించారు.