సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటైన కర్తార్‌పుర్ యాత్రపై కొర్రీలు పెడుతోంది పాకిస్థాన్. యాత్రికులను ఏడాది పొడవునా అనుమతించాలన్న భారత్ ప్రతిపాదనను తోసిపుచ్చింది. కర్తార్‌పుర్ కారిడార్ యాత్రపై పలు నిబంధనలు, షరతులు విధించింది.
కర్తార్‌పుర్‌లోని గురుద్వార్ దర్బార్ సాహిబ్‌ను దర్శించుకునేందుకు రోజుకు 5000 మంది భక్తులను అనుమతించాలని భారత్ ప్రతిపాదించింది. కానీ 700 మంది యాత్రికులను మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది పాక్. వీరికి ప్రత్యేక అనుమతులు అవసరమని తెలిపింది. భక్తులకు ఉచిత వీసా సౌకర్యం కల్పించాలన్న భారత ప్రతిపాదనను పెడచెవిన పెడుతూ.. వీసా ఛార్జీలు వసూలు చేయనున్నట్లు పేర్కొంది.
భారతీయులతో పాటు విదేశాల్లోని భారత సంతతికి చెందిన వారినీ ఈ యాత్రకు అనుమతించాలని భారత్ కోరింది. కేవలం భారతీయులనే అనుమతిస్తామని పాక్ స్పష్టం చేసింది. యాత్రకు వచ్చే బృందాల్లో 15 మందిని మాత్రమే అనుమతిస్తామని తెలిపింది.