తెలంగాణ

telangana

ETV Bharat / international

కశ్మీర్​పై ట్వీట్​- పాక్​ అధ్యక్షుడికి ట్విట్టర్​ షాక్​..!

జమ్ముకశ్మీర్‌ అంశంలో తలదూర్చిన పాకిస్థాన్‌ అధ్యక్షుడు అరిఫ్‌ అల్వీకి ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్ధ ట్విట్టర్‌ షాకిచ్చింది. కశ్మీర్​ పరిస్థితులపై ఆయన పోస్ట్‌ చేసిన వీడియోలు భారతీయ చట్టాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ ఆయనకు నోటీసులు జారీ చేసింది.

కశ్మీర్​పై ట్వీట్​- పాక్​ అధ్యక్షుడికి ట్విట్టర్​ షాక్​..!

By

Published : Aug 27, 2019, 5:06 AM IST

Updated : Sep 28, 2019, 10:10 AM IST

కశ్మీర్​లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం పాకిస్థాన్​ వ్యవహరిస్తోన్న తీరును అంతర్జాతీయ సమాజం ఆక్షేపిస్తోంది. భారత్​ను ఇరుకున పెట్టాలనుకుంటున్న ప్రతిసారి పాక్​కు భంగపాటు తప్పడం లేదు. తాజాగా పాక్​ అధ్యక్షుడు అరిఫ్​ అల్వీకి సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్​ నోటీసులు జారీ చేసింది. కశ్మీర్​ పరిస్థితులపై ఆయన పోస్ట్​ చేసిన ఓ వీడియో భారత చట్టాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ అభ్యంతరం తెలిపింది.

ట్విట్టర్‌ సంస్థ నుంచి మెయిల్‌ ద్వారా వచ్చిన ఈ నోటీసులను ఆ దేశ మానవహక్కుల మంత్రి షిరీన్‌ మజారీ వెల్లడించారు. అంతేకాకుండా ఈ నోటీసులపై ఆయన స్పందిస్తూ ఇది చాలా హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. పాక్‌ అధ్యక్షుడు అల్వీ సోమవారం కశ్మీర్‌ నిరసనలకు సంబంధించిన ఓ ర్యాలీ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

కశ్మీర్‌కు అనుకూలంగా పోస్ట్‌లు చేస్తోన్న వారి ఖాతాలను ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లు తొలగిస్తున్నాయని గత వారమే పాక్‌కు చెందిన పలువురు అధికారులు ఆరోపించారు. అంతేకాకుండా ట్విట్టర్‌ ప్రధాన కార్యాలయాల్లో భారతీయ సిబ్బంది ఉన్నారు కనుకే కశ్మీర్‌కు అనుకూలంగా పోస్ట్‌లు చేస్తే తమ ఖాతాలను తొలగిస్తున్నారని విమర్శించారు.

Last Updated : Sep 28, 2019, 10:10 AM IST

ABOUT THE AUTHOR

...view details