తెలంగాణ

telangana

ETV Bharat / international

కశ్మీర్ అంశంపై పాక్ రగడ-అరగంట పాటు ఆందోళన - పాకిస్థాన్

కశ్మీర్ స్వయంప్రతిపత్తి తొలగింపుపై పాకిస్థాన్ అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. దేశవ్యాప్తంగా భారత నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. 80 లక్షలమంది ప్రజలు 4 వారాలుగా నిర్బంధం ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు పాక్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్. భారత్​ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పాక్ ఎగువసభ తీర్మానాన్ని ఆమోదించింది.

కశ్మీర్ అంశంపై పాక్ రగడ-అరగంట పాటు ఆందోళన

By

Published : Aug 30, 2019, 9:00 PM IST

Updated : Sep 28, 2019, 9:52 PM IST

జమ్ముకశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దుపై పాకిస్థాన్ విషం చిమ్ముతూనే ఉంది. కశ్మీరీలకు సంఘీభావం పేరుతో అరగంటపాటు పాక్ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. సైరన్లు మోగించి ట్రాఫిక్​లో ఉన్న వారు ఎక్కడివారిని అక్కడే నిలబడాలని సూచించింది. ఇస్లామాబాద్​లో నిర్వహించిన కార్యక్రమంలో పాక్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్ పాల్గొన్నారు.

"నేడు విద్యార్థులు, దుకాణాల యజమానులు, కార్మికులు అనే భేదం లేకుండా పాకిస్థానీయులంతా కశ్మీరీలకు సంఘీభావంగా నిలబడ్డారు. ప్రస్తుతం కశ్మీరీలు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సుమారు 80 లక్షలమంది ప్రజలు గత నాలుగు వారాలుగా నిర్బంధంలో జీవిస్తున్నారు."

-ఇమ్రాన్​ఖాన్​, పాకిస్థాన్ ప్రధానమంత్రి

కశ్మీరీలకు పాక్ అండగా ఉంటుందనే భరోసా కల్పించడానికే ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు వెల్లడించారు ఇమ్రాన్. అక్రమంగా కశ్మీర్​ను కలిపేసుకోవాలని చూస్తే పాక్ దీటైన జవాబు చెబుతుందని వ్యాఖ్యానించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న రెండు దేశాల మధ్య అసఖ్యత ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తుందన్నారు.

సెప్టెంబర్ 27న ఐక్యరాజ్యసమితి సర్వసభ్యసమావేశంలో ఇమ్రాన్ ఖాన్ పాల్గొననున్న సందర్భంగా మరో ఆందోళనకు సంకల్పించింది పాక్.

పాక్ తీర్మానం...

కశ్మీర్ స్వయంప్రతిపత్తి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్థాన్ ఎగువసభ అయిన సెనేట్ నేడు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. భారత చర్య ఐక్యరాజ్యసమితి చార్టర్​ను, భద్రతా మండలి తీర్మానాన్ని, అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను తక్కువ చేసినట్లుగా ఉందని వ్యాఖ్యానించింది.

ఇదీ చూడండి: ఆరేళ్ల కనిష్ఠానికి దేశ వృద్ధి రేటు.. 5 శాతంగా నమోదు

Last Updated : Sep 28, 2019, 9:52 PM IST

ABOUT THE AUTHOR

...view details