కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ దృష్టికి తీసుకెళ్లడానికి పాక్ చేసిన విశ్వప్రయత్నాలు బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పాక్ అంతర్గతంగానూ విమర్శలు ఎదుర్కొంటుంది. కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ మద్దతు సాధించడంలో పాకిస్థాన్ విఫలమైందని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఇజాజ్ అహ్మద్‌షా అంగీకరించారు. పాక్‌కు చెందిన హమ్ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ముఖామఖిలో ఇమ్రాన్ ఖాన్‌పైనా విమర్శలు గుప్పించారు.
కశ్మీర్ విషయంలో ఇమ్రాన్‌కు పాక్ మంత్రి షాక్
కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ మద్దతు సాధించడంలో పాకిస్థాన్ విఫలమైందని స్వయంగా ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఇజాజ్ అహ్మద్‌షా అంగీకరించారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సహా పాకిస్థాన్ పాలకులు దేశ పరువు, ప్రతిష్ఠలను నాశనం చేశారని ఇజాజ్ అహ్మద్‌షా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
"కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ సమాజంలో ఎవరు పాకిస్థాన్‌ను విశ్వసించడం లేదు. పాకిస్థాన్ పాలకులు దేశ పరువు, ప్రతిష్ఠలను నాశనం చేశారు. భారత ప్రభుత్వం కశ్మీర్‌లో కర్ఫ్యూ విధించిందని, ప్రజలకు ఔషధాలు కూడా అందకుండా చేస్తోందని పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలను ఎవరూ నమ్మడంలేదు. అంతర్జాతీయ సమాజం భారత్‌నే విశ్వసిస్తోంది." ఇజాజ్ అహ్మద్‌షా, పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి
ఇమ్రాన్‌ఖాన్, బెనజీర్ భుట్టో, పర్వేజ్ ముషారఫ్ కూడా తమరు ఆరోపించిన పాకిస్థాన్ పాలకుల్లో ఉన్నారా అని ప్రశ్నించగా.. దేశప్రతిష్ఠ దెబ్బతినడానికి వారంతా కారణమేనని ఆయన చెప్పారు. పాకిస్థాన్ నిఘా సంస్థ అధిపతిగా కూడా పనిచేసిన ఇజాజ్ అహ్మద్ షా పాకిస్థాన్ ప్రస్తుతం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చిందని సూచించారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్‌లో కశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ లేవనెత్తగా భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ విషయంలో పాక్‌కు అండగా ఏ దేశమూ నిలబడ లేదు. ఈ పరిణామాల దృష్ట్యా పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి అహ్మద్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
- ఇదీ చూడండి: భారత్ X చైనా: మరోసారి సరిహద్దు ఉద్రిక్తతలు