తైవాన్లో జరుగుతున్న భారీ కళా ప్రదర్శనలో కొత్త తరం పెయింటింగ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రెండు విభిన్న ఆసక్తులను మిళితం చేస్తూ అద్భుతాలను సృష్టించారు రష్యన్ చిత్రకారిణి ఓల్గా బెల్కా. సముద్రగర్భంలో ఆమె గీస్తున్న చిత్రాలను చూస్తుంటే మైమరిచిపోతాం.
ఓల్గాకు స్కూబా డైవింగ్, పెయింటింగ్ రెండింటిపైనా ఆసక్తి ఉంది. ఈ రెండింటినీ కలిపి కళాఖండాలకు ప్రాణం పోస్తున్నారు ఆ చిత్రకారిణి. దీనికే స్కూబా పెయింటింగ్ అంటూ నామకరణం చేశారు. ఇదేమీ అంత సులువైన పని కాదండోయ్. కానీ ఇలా చిత్రాలను గీస్తుంటే ధ్యానం చేసినట్టు ఉంటుందంటున్నారు ఓల్గా.
"మీరు నీటి అడుగున కూర్చున్నప్పుడు స్కూబా ద్వారా చాలా నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటారు. ఫలితంగా ధ్యానం చేసిన అనుభూతి కలుగుతుంది. నాతో పాటు వచ్చే మోడళ్లు కూడా అదే విధంగా భావిస్తారు. " - ఓల్గా బెల్కా, స్కూబా పెయింటర్
కొన్నిసార్లు 30 మీటర్ల లోతులో కూడా పెయింటింగ్ వేస్తానని ఆమె చెబుతున్నారు.