ప్రపంచ దేశాలను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 26 లక్షల 58 వేల మందికిపైగా వైరస్ బారిన పడ్డారు. దాదాపు లక్షా 85వేల మందిని మహమ్మారి బలితీసుకుంది. ప్రాణాంతక వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 7లక్షల 30 వేలకు చేరింది.
స్పెయిన్లో 22వేల మరణాలు
స్పెయిన్లో గత రెండు రోజుల నుంచి కరోనా మరణాలు పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో మరో 440 మంది మరణించినట్లు ఆ దేశ యంత్రాంగం తెలిపింది. దీంతో మొత్తం 22,157మంది కొవిడ్-19తో మృతి చెందారు. ఇప్పటివరకు 2 లక్షల 13వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
సింగపూర్లో వెయ్యి మందికి కరోనా
సింగపూర్లో గురువారం మరో 1037 మంది విదేశీ కార్మికులకు కరోనా సోకినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. వీరిలో వేయ్యి మందికి పైగా భారతీయ కార్మికులున్నట్లు తెలిపారు.
పాకిస్థాన్ 10వేలు దాటిన కేసులు
పొరుగుదేశం పాకిస్థాన్లో తాజాగా 745 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఆ దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 10వేలు దాటాయి. మరో 15 మంది మృతి చెందారు. మహమ్మారి కారణంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ పాక్ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి 1.39 బిలియన్ డాలర్ల రుణాన్ని పొందింది.