అమెరికా-ఉత్తర కొరియా మధ్య అణు వివాదం తారస్థాయికి చేరుకుంది. ఉత్తర కొరియా ప్రతికూల విధానాలను అమెరికా వీడనంత వరకు అణు నిరాయుధీకరణను కొనసాగించేది లేదని తేల్చి చెప్పింది కిమ్ ప్రభుత్వం. స్వీడన్ వేదికగా జరిగిన చర్చలు విఫలమైన మరుసటి రోజునే ఈ మేరకు వ్యాఖ్యానించింది.
గత ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌ల భేటీ తర్వాత నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు స్వీడన్‌లోని స్టాక్‌హోం వేదికగా చర్చలు చేపట్టాయి ఇరుదేశాలు. కానీ ఈ చర్చలు ఎలాంటి పరిష్కారం లేకుండానే ముగిశాయి. అమెరికా ప్రతిపాదించిన అంశాలు తమకు సంతృప్తికరంగా లేవని పేర్కొంది ఉత్తర కొరియా. అమెరికా పాత వైఖరినే ఇప్పుడూ అవలంబించటమే ఇందుకు కారణమని పేర్కొంది.
"కొరియా విరుద్ధ విధానాలను వీడనాడేందుకు అమెరికా ఆచరణాత్మక చర్యలు తీసుకోకపోతే చర్చలు కష్టమే. కొరియా-అమెరికా మధ్య చర్చల సఫలత అనేది వాషింగ్టన్ చేతిలోనే ఉంది. అందుకు ఈ ఏడాది చివరి వరకు గడువు ఉంది."