North Korea Kim: తన సైనిక సామర్థ్యాన్ని మరింత పటిష్ఠం చేస్తానని, కరోనా కట్టడికి కఠినమైన చర్యలను కొనసాగిస్తానని, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు బలంగా కృషి చేస్తానని ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ స్పష్టం చేశారు. అధికార పార్టీ ప్లీనరీలో పలు కీలక అంశాలపై మాట్లాడినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే అమెరికా, దక్షిణ కొరియాతో ఏ విధంగా వ్యవహరించబోతున్నారనే విషయంపై మాత్రం కిమ్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని పేర్కొంది.
కొంతమంది నిపుణులు మాత్రం అమెరికా, దక్షిణ కొరియాతో ఇప్పట్లో చర్చలు పునరుద్ధరించడానికి కిమ్ సుముఖంగా లేరని అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారి సంబంధిత ఇబ్బందులను అధిగమించడానికి, స్వావలంబన ఆర్థిక వ్యవస్థ కోసం దేశ సరిహద్దులను మూసివేయాలనే విషయాన్ని ఇది సూచిస్తోందన్నారు.
kim jong un news
కొరియన్ ద్వీపకల్పంలో పెరుగుతున్న అస్థిరత.. అంతర్జాతీయ రాజకీయాల కారణంగా తక్షణమే జాతీయ రక్షణ నిర్మాణ ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లాలని కిమ్ పిలుపునిచ్చారు. సైనిక బలగాలను మెరుగుపరచడానికి శక్తివంతమైన, ఆధునిక ఆయుధ వ్యవస్థలను ఉత్పత్తి చేయాలని ఆదేశించారు. అలాగే పాలక పక్షానికి సైన్యం సంపూర్ణ విధేయతతో ఉండాలని, తన పార్టీ నిర్ణయాలకు మద్దతుగా ఉండాలని కోరారు.
North Korea news
కిమ్ అధికారంలోకి వచ్చి పదేళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ కేంద్ర కమిటీ ఐదు రోజుల ప్లీనరీ సమావేశం నిర్వహించింది. డిసెంబరు 2011లో తండ్రి మరణం తర్వాత కిమ్ ఉత్తరకొరియా పగ్గాలు చేపట్టాడు. దేశాన్ని మరింత శక్తిమంతం చేసే ప్రయత్నాలు చేశారు. అణు, క్షిపణి ఆయుధ సంపత్తిని బలపరిచారు. అయితే మహమ్మారి కారణంగా సరిహద్దు మూసివేతలు, ఐక్యరాజ్యసమితి ఆంక్షలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థ గత రెండేళ్లలో పెద్ద ఎదురుదెబ్బలను చవిచూసింది. ఉత్తర కొరియాలో రాజకీయ అస్థిరత సంకేతాలు లేనప్పటికీ, ప్రస్తుత కష్టాలు కొనసాగితే కిమ్ నాయకత్వ దీర్ఘకాలిక స్థిరత్వం ప్రశ్నార్థకం కావచ్చని కొందరు నిపుణులు భావిస్తున్నారు.
తన మునుపటి ఆర్థిక అభివృద్ధి ప్రణాళికలు విఫలమయ్యాయని గతేడాది జనవరిలో జరిగిన పార్టీ కాంగ్రెస్‌లో కిమ్ అంగీకరించారు. తన దేశం ఎన్నడూ లేని దుస్థితిని ఎదుర్కొందని చెప్పారు. కానీ ఈ వారం ప్లీనరీ సెషన్‌లో కొత్త అభివృద్ధి ప్రణాళికలలో పురోగతిని సాధించినట్లు కిమ్ చెప్పారు. 2021 గొప్ప విజయవంతమైన సంవత్సరమని, ఇది పెద్ద మార్పులు, అభివృద్ధికి నాందిగా ఉపయోగపడుతుందని అన్నారు. వ్యవసాయం, నిర్మాణం, విద్యుత్, మైనింగ్, అటవీ సహా అనేక ఇతర రంగాలలో పురోగతిని కిమ్ ఉదహరించారు.
ఇదీ చదవండి:ఉత్తర కొరియాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్