తెలంగాణ

telangana

ETV Bharat / international

ఐదో అంతస్తులో అంతుచిక్కని రహస్యం! - యాంగ్గాడో హోటల్​

ఏ హోటల్​లో అయినా సిబ్బందికి తప్ప సామాన్య ప్రజలకు అనుమతి లేని కొన్ని గదులుంటాయి. అంతే గానీ పూర్తిగా అంతస్తులోకే అనుమతి లేకుండా ఉండవు. కానీ ఉత్తర కొరియాలోని ఓ హోటల్​లోని ఐదో అంతస్తులోకి ఎవరినీ అనుమతించరు. దీనిని అక్కడి ప్రభుత్వం ఎంతో రహస్యంగా ఉంచుతోంది. అంతలా అందులో ఏముంది?

North Korea hotel where not alloed to fifth floor
ఆ ఐదో అంతస్తు... అంతుచిక్కని రహస్యం!

By

Published : Nov 15, 2020, 1:02 PM IST

ఉత్తర కొరియా అంటే కిమ్‌.. కిమ్‌ అంటే ఉత్తర కొరియా. ఆయన ప్రకటనలు తప్ప ఆ దేశానికి సంబంధించి ఎలాంటి వివరాలూ ప్రపంచానికి తెలియనివ్వరు. బయట జరిగే విషయాలు ఆ దేశస్థులకు చేరనివ్వరు. అందుకే ఉత్తర కొరియాను ఒక రహస్యాల పుట్టగా అభివర్ణిస్తుంటారు. అక్కడి రహస్యాల్లో యాంగ్గాక్‌డో ఇంటర్నేషనల్‌ హోటల్‌లోని ఐదో అంతస్తు ఒకటి. ఈ హోటల్‌లోని ఐదో అంతస్తును అక్కడి ప్రభుత్వం ఎంతో రహస్యంగా ఉంచుతోంది. ఎవర్నీ అందులోకి అనుమతించట్లేదు. అంతలా అందులో ఏముంది? ఎందుకు అక్కడికి అనుమతించరు?

ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌ పరిధిలోని టాయిడాంగ్‌ నదిలో ఉన్న ఐలాండ్స్‌లో ఉందీ యాంగ్గాక్‌డో హోటల్‌. ఆ దేశంలోని అత్యంత ఎత్తయిన భవంతుల్లో ఇదీ ఒకటి. ఉత్తర కొరియాలో తొలి లగ్జరీ హోటల్‌గానూ పేరుంది. 1986లో దీని నిర్మాణం ప్రారంభమై 1992లో ముగిసింది. ఇందులో వెయ్యి గదులు, నాలుగు రెస్టారెంట్లు, స్విమ్మింగ్‌పూల్‌, గేమింగ్ ‌జోన్‌ తదితర సదుపాయాలున్నాయి. విదేశీ పర్యటకులు వస్తే ఈ హోటల్‌లోనే ఎక్కువగా బస చేస్తుంటారు. అయితే 47 అంతస్తులుండే ఈ హోటల్‌లో ఐదో అంతస్తులోకి మాత్రం సాధారణ ప్రజలను, పర్యాటకులను అనుమతించరు. లిఫ్ట్‌లో ఐదో అంతస్తుకి వెళ్లడానికి నొక్కాల్సిన బటన్‌ ఉండదు. ఆ అంతస్తులో లిఫ్ట్‌ ఆగదు. అందులో ఏముందో.. ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు.

అయితే, కొంతమంది పర్యటకులు అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవాలన్న ఆసక్తితో మెట్ల మార్గం గుండా వెళ్లే ప్రయత్నం చేశారు. ఉత్తరకొరియాలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు ఉంటాయి. అయినా, పలువురు అక్కడికెళ్లి ఫొటోలు, వీడియోలు తీసి క్షేమంగా బయటపడ్డారు. పర్యటకులు చెప్పిన వివరాల ప్రకారం.. ఐదో అంతస్తు రెండు అంతస్తులుగా విభజించి ఉందట. ఒకటి రెండు గదులు మినహా అన్నిటికీ తాళాలున్నాయని, గోడలపై అమెరికా, జపాన్‌లకు వ్యతిరేకంగా పలు నినాదాలతో పోస్టర్లు అంటించి ఉన్నట్లు తెలిపారు. అక్కడి టూరిస్టు గైడ్‌లు మాత్రం అన్ని హోటళ్లలో ఉండే విధంగానే ఇందులోనూ అదొక సర్వీస్‌ లెవెల్‌ మాత్రమేనని, హోటల్‌ సిబ్బందినే అనుమతిస్తారని చెబుతున్నారు. కానీ, అక్కడ ఏదో రహస్యం దాగుందని, ప్రపంచానికి తెలియకుండా ఏదో చేస్తున్నారని కొందరు భావిస్తున్నారు.

ఒట్టో వాంబియర్‌ విషాదం

అమెరికాకి చెందిన ఒట్టో వాంబియర్‌ 2015 డిసెంబర్‌లో ఉత్తర కొరియా పర్యటనకు వెళ్లారు. అప్పుడతని వయసు 20. యాంగ్గాక్‌డో హోటల్‌లో బస చేసిన ఆయన్ను 2016 జనవరిలో పోలీసులు అరెస్టు చేశారు. రెండో అంతస్తులో గోడకు అతికించిన ఒక బ్యానర్‌ను తొలగించి.. కింద పడేయడమే కాకుండా దాన్ని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడని అక్కడి సిబ్బంది ఫిర్యాదు చేశారు. కానీ, ఈ ఘటన ఐదో అంతస్తులో జరిగిందని మీడియాలో వార్తలొచ్చాయి. ఏ అంతస్తులో జరిగిందో తెలియదు గానీ.. ఒట్టోకు మాత్రం కోర్టు 15ఏళ్ల జైలు శిక్ష విధించింది. జైలుకు వెళ్లిన కొన్ని నెలలకే అతడు తీవ్ర అస్వస్థతకు గురై కోమాలోకి వెళ్లాడు. ఒట్టో ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన అధికారులు 2017 జూన్‌లో అతడిని విడుదల చేయడం వల్ల అమెరికాకు తీసుకెళ్లారు. కానీ, కొన్ని రోజులకే అతడు ప్రాణాలు కోల్పోయాడు.

ఇదీ చూడండి:ట్రంప్ మద్దతుదారులు, నిరసనకారుల మధ్య ఘర్షణ

ABOUT THE AUTHOR

...view details