ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల నమోదు పెరుగుతోంది. ముఖ్యంగా వైరస్ కట్టడిలో విజయవంతమైన దక్షిణ కొరియాలో ఇవి ఎక్కువగా ఉన్నాయి. అక్కడ కోలుకొన్న 7,829 మంది రోగుల్లో 2.1 శాతం మందిలో కరోనా వైరస్ లక్షణాలు తిరగబెట్టడం ఆందోళనకరంగా మారింది. అయితే కరోనా నుంచి ఒకసారి కోలుకొన్న వ్యక్తికి మళ్లీ వ్యాధి తిరగబెట్టే అవకాశం ఉన్నట్లు నిరూపించే బలమైన సమాచారం ఏదీ లేదని అమెరికా సీడీసీ పేర్కొంటోంది. ఒకసారి వ్యాధి లక్షణాలు కనుమరుగై.. కోలుకొనే సమయంలో వైరస్ ఆర్‌ఎన్‌ఏలు ఆ వ్యక్తిలో కనిపించినా వ్యాధి ఉన్నట్లు కాదని వెబ్‌సైట్‌లో పేర్కొంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని సూచించే ఐజీఎం, ఐజీజీ యాంటీబాడీస్ గుర్తించడాన్ని బట్టి కోలుకొంటున్నట్లు నిర్ధారిస్తారు.
39 రోజుల వరకు వైరస్ ఆనవాళ్లు..
ఇటీవల ‘అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్’ పరిశోధనల్లో కొవిడ్ నుంచి కోలుకొన్న వ్యక్తి కఫం, మలంలో వైరస్ ఆనవాళ్లను గుర్తించారు. ఈ నేపథ్యంలో రోగులకు చేసే తెమడ పరీక్షలు నమ్మదగినవేనా.. మరిన్ని రకాల పరీక్షలు నిర్వహించాలా అనే సందేహాలు వస్తున్నాయి. రోగిని డిశ్ఛార్జి చేయడానికి ముందు 24 గంటల తేడాతో నిర్వహించే పీసీఆర్ పరీక్షలు రోగి కోలుకొన్నట్లు నిర్ధారించడానికి సరిపోతాయా? అనే సందేహాలకు తావిస్తున్నాయి. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 27 వరకు బీజింగ్‌లోని డిటాన్ ఆసుపత్రి 133 మంది కొవిడ్ రోగులను పరిశీలించింది. గొంతు, ముక్కు నుంచి నమూనాలు సేకరించి పరీక్షించి 22 మందిలో నెగెటివ్ వచ్చింది. అయితే వారి కఫం, మలంలో 13 నుంచి 39 రోజుల పాటు వైరస్ ఆనవాళ్లు కనిపించాయి. రోగ లక్షణాలు తగ్గి శరీరం కోలుకొనే సమయంలో విసర్జకాల్లో కొంత వైరస్‌ల ఆనవాళ్లు కనిపించడం సహజ ప్రక్రియే అని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ఇది వైరస్ జన్యు పదార్థమేగానీ, వైరస్ కాదని న్యూయార్క్‌కు చెందిన అంటువ్యాధుల నిపుణురాలు మేఘన్ కాఫే పేర్కొన్నారు.
మళ్లీ రాదన్న హామీ లేదు
ఒకసారి కరోనా సోకిన వ్యక్తికి మళ్లీ ఆ వ్యాధి రాదన్న హామీ ఏమీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. కరోనా సోకితే జీవితాంతం వ్యాధి నిరోధక శక్తి వచ్చేస్తుందనే వాదనలను తోసిపుచ్చింది. ‘‘కొన్ని దేశాలు సార్స్ కోవ్2 పై పనిచేసే రోగ నిరోధక శక్తిని పరీక్షించి ‘ఇమ్యూనిటీ పాస్‌పోర్టులు’,‘ రిస్క్‌ఫ్రీ సర్టిఫికెట్లు’ జారీచేయాలని భావిస్తున్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొన్న వారు మరోసారి వ్యాధి బారిన పడకుండా రోగ నిరోధక శక్తి రక్షిస్తుందనడానికి ఆధారాల్లేవు. ఇప్పటివరకు ఏ పరిశోధనా ఈ విషయాన్ని నిరూపించలేదు’’ అని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.