ఏటా ఏప్రిల్ 26వ తేదీన ప్రపంచ మేధా హక్కుల రక్షణ దినోత్సవం జరుపుకొంటున్నాం. ఈ ఏడాది కరోనా కలవరంలో దాని గురించి పెద్దగా పట్టించుకున్నవారు లేకుండాపోయారు. ఈ వైరస్‌పై మానవుడు గెలవాలంటే కొత్త మందులు, వ్యాక్సిన్లను కనిపెట్టకతప్పదు. వాటిని కనిపెట్టిన దేశాలు, వ్యక్తులు, సంస్థల మేధాహక్కులు (ఐపీఆర్) అమూల్యమైనవిగా మారనున్నాయి. అటువంటి హక్కులకు 193 దేశాలు సభ్యులుగా ఉన్న ప్రపంచ మేధాహక్కుల పరిరక్షణ సంస్థ (విపో) సాధికార గుర్తింపునిస్తోంది.
పేటెంట్లు, కాపీరైట్లు, పారిశ్రామిక డిజైన్లు, ట్రేడ్ మార్కులు, భౌగోళిక సూచీలను ఐపీఆర్ లేదా మేధా హక్కులుగా పరిగణిస్తారు. ప్రపంచంలోని 8 కోట్ల పైచిలుకు పేటెంట్లకు, 4 కోట్లకు పైబడిన బ్రాండ్లకు, ఒక కోటీ 22 లక్షల పారిశ్రామిక డిజైన్లకు, 200 దేశాల మేధాహక్కులకు సంబంధించిన 15,988 చట్టాలు, ఒప్పందాలు, రికార్డులు, విధాన పత్రాలకు విపో సంరక్షకురాలిగా నిలుస్తోంది. పేటెంట్ సహకార ఒప్పందం కింద ఒక వ్యక్తి లేదా సంస్థ పేటెంట్ కోసం పెట్టే అంతర్జాతీయ దరఖాస్తు విపో సభ్య దేశాలన్నింటిలో చలామణి అవుతుంది.
వ్యవస్థలు బలోపేతం కావాలి
నేడు అమెరికా, ఐరోపాలలో పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డి)కి నిధుల కేటాయింపు తగ్గిపోయింది. అందుకే ఆ దేశాల నుంచి కొత్త పేటెంట్ల కోసం దరఖాస్తులూ తగ్గాయి. కొవిడ్ కు వైరస్ కనిపెట్టడంలో ఆలస్యానికి కారణమిదే. 2018లో మొత్తం 33 లక్షల పేటెంట్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. అది అంతకుముందు సంవత్సరంకన్నా 5.2 శాతం ఎక్కువే.
2018 పేటెంట్ల దరఖాస్తుల్లో మొట్టమొదటిసారిగా అమెరికాను చైనా మించిపోయింది. మొత్తం పేటెంట్ దరఖాస్తుల్లో సగం చైనావే. అమెరికా నుంచి 5 లక్షల దరఖాస్తులే వచ్చాయి. 1883 నుంచి 1963 వరకు పేటెంట్ దరఖాస్తుల్లో ప్రథమ స్థానం అమెరికాదే. 1970-2005 మధ్యకాలంలో జపాన్, అమెరికాలు కలసి అత్యధిక పేటెంట్ దరఖాస్తులు పెట్టాయి. 2005 నుంచి చైనా జోరు పెరగసాగింది. నేడు ప్రపంచంలో దాఖలవుతున్న పేటెంట్ దరఖాస్తుల్లో 85.3 శాతం చైనా, అమెరికా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియాల నుంచే వస్తున్నాయి. 2008లో ఆసియా దేశాలు 50.8 శాతం దరఖాస్తులు దాఖలు చేయగా, 2018లో వాటి వాటా 66.8 శాతానికి పెరిగింది. ఇదే కాలంలో ఉత్తర అమెరికా, ఐరోపా దేశాల వాటా 43.7 నుంచి 30 శాతానికి తగ్గింది.
భారత్ ఎక్కడ...