నేపాల్ అధికార పార్టీలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతోన్న రాజకీయ సంక్షోభం శనివారం తారస్థాయికి చేరింది. తాజాగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పుష్ప కమల్ దహాల్ 'ప్రచండ'పై ఆరోపణలు చేశారు ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి. పార్టీని సంప్రదించకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని గతంలో ప్రచండ చేసిన ఆరోపణలను ఖండించారు. పార్టీ వ్యవహారాల్లో తనకు సహకరించటం లేదని ఆరోపించారు.
నేపాల్ అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (సీపీఎన్) కేంద్ర కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ భేటీ సందర్భంగా ప్రచండ చేసిన ఆరోపణలకు ప్రతిస్పందనగా.. 38 పేజీల ప్రత్యేక రాజకీయ పత్రాన్ని సమర్పించారు ఓలి. అందులోని 19వ పేజీలో ప్రచండ ఆరోపణలపై ప్రస్తావించారు. పార్టీ వ్యవహారాల్లో, ప్రభుత్వాన్ని నడపటంలో ప్రచండ తనకు సహకరించటం లేదని ఆరోపించారు ఓలి.
బలువాటర్లోని ప్రధాని అధికారిక నివాసంలో సమావేశం జరిగినట్లు సీపీఎన్ అధికార ప్రతినిధి నారాయణ్ కాజీ శ్రేష్ఠ తెలిపారు. తదుపరి సమావేశం డిసెంబర్ 1న కాఠ్మాండు ధుంబరాహిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరగనున్నట్లు చెప్పారు.