తెలంగాణ

telangana

ETV Bharat / international

అజార్​ చిక్కు తొలిగేనా? - పాక్​

వరుస ఉగ్రదాడులు. పదుల సంఖ్యలో మృతులు. అన్నింటికీ కారణం ఒకటే... జైషే మహ్మద్. పాకిస్థాన్​ కేంద్రంగా పనిచేసే ఆ ఉగ్రమూక తీరును ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తాయి. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు సాగించాలని ప్రకటనలు చేస్తాయి. కానీ... జైషే అధినేత మసూద్​ అజార్​పై చర్యల విషయంలో మాత్రం విఫలమవుతున్నాయి. ఎందుకు? కరడుగట్టిన తీవ్రవాదికి అండగా నిలుస్తోంది ఎవరు?

అజార్​ చిక్కు తొలిగేనా?

By

Published : Mar 1, 2019, 8:30 AM IST

మౌలానా మసూద్​ అజార్​..... కరుడుకట్టిన ఉగ్రవాది. పాకిస్థాన్​ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్(జేఈఎం)​ అధినేత. మన దేశంలో జరిగే ఏ పెద్ద ఉగ్రదాడిలోనైనా ఇతను స్థాపించిన జైషే మహ్మద్​ హస్తం ఉంటుంది. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో దేశంలోనే అతిపెద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 40 మందికిపైగా సీఆర్​పీఎఫ్​ జవాన్లు మరణించారు. బాధ్యులం తామే అని ప్రకటించుకుంది మసూద్​ ముఠా.

ఎప్పటినుంచో మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని భారత్​ సహా పలు దేశాలు కోరుతున్నాయి. అయినా అది నెరవేరడం లేదు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలోని సభ్య దేశాల సంఖ్య 15. ఇందులో చైనా కూడా ఉండటమే ఇందుకు కారణం. వీటో అధికారమున్న చైనా... మసూద్​ అంతర్జాతీయ గుర్తింపు ప్రకటనకు అడ్డుపడుతూ వస్తోంది.

తాజాగా పుల్వామా దాడి తర్వాతా చైనా అదే చెప్పుకొచ్చింది. అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడానికి తగిన సాక్ష్యాధారాలు లేవనేది డ్రాగన్​ వాదన. ఫ్రాన్స్​, రష్యా, అమెరికా దేశాలు ముందుకొచ్చినా చైనా అడ్డుపడింది.

ఇదీ నేపథ్యం....

1999లో నేపాల్​ నుంచి బయలుదేరిన ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని ఉగ్రవాదులు అఫ్గాన్‌లోని కాందహార్‌కు హైజాక్‌చేశారు. అనంతరం చర్చల్లో భాగంగా భారత ప్రభుత్వం మౌలానా మసూద్‌ అజార్‌తో పాటు మరికొందరు ఉగ్రవాదులను కాందహార్‌కు తీసుకువెళ్లి హైజాకర్లకు అప్పగించింది. అలా నిర్బంధం నుంచి బయటపడ్డ మసూద్‌ తరువాత జైషే మహ్మద్​ ఉగ్రసంస్థను నెలకొల్పాడు.

మసూద్‌కు భారత్‌ అంటే నిలువెల్లా విద్వేషం. కశ్మీర్‌ను భారత్‌ నుంచి విడగొట్టాలన్న కుట్రతో ఎన్నో ముష్కరదాడులకు నేతృత్వం వహించాడు.

2001లో పార్లమెంటుపై ఆత్మాహుతి దాడి, 2016లో పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి, 2016లోనే ఉరీ సైనికస్థావరంపై దాడి.. ఇలా పలు భయానక ఉగ్రవాద కార్యకలాపాలకు మసూదే సూత్రధారి.

చైనానే అడ్డు...

పాక్‌లోని ఉగ్రవాదులకు ఆ దేశ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా చైనా అండగా ఉండటం గమనార్హం. భద్రతామండలిలో 15 సభ్యదేశాలు ఉంటే చైనా ఒక్కటే అడ్డుపడటంపై అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నా డ్రాగన్​ వైఖరి మాత్రం మారడంలేదు.

పాక్‌తో సంబంధాలు

చైనాకు పాక్‌తో వాణిజ్యపరంగా దృఢమైన సంబంధాలు ఉన్నాయి. చైనా, పాక్‌ ఆర్థిక నడవాకు కమ్యూనిస్ట్​ దేశం భారీగా నిధులు సమకూరుస్తోంది. భారత్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ తమకు సవాల్‌గా మారకూడదన్నదే చైనా విధానం. అందులో భాగంగానే భారత్‌కు వ్యతిరేకంగా... పాక్‌ కేంద్రంగా ఉన్న ఉగ్రవాద శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్నది జగమెరిగిన సత్యం.

మూడుసార్లు నిరాశే....

  • భారత్​ తొలిసారిగా 2009లో మసూద్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలనే విధానపర నిర్ణయం తీసుకుంది.
  • మళ్లీ 2016లో ఐరాస- 1267 ఆంక్షల కమిటీ ముందు అమెరికా, బ్రిటన్​, ఫ్రాన్స్​తో కలిసి రెండో సారి ప్రతిపాదన తీసుకొచ్చింది. 2016లో పఠాన్​కోట్​ వైమానిక స్థావరంపై దాడికీ తానే సూత్రధారిగా ప్రకటించుకున్నాడు మసూద్​.
  • 2017లో మూడోసారి అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలనే నిర్ణయం తీసుకొని, ఐరాసకు కదిలాయి అమెరికా, బ్రిటన్​, ఫ్రాన్స్.

అయితే ఈ మూడుసార్లు అజార్​పై నిషేధానికి అడ్డుపడింది చైనానే.

ఖండిస్తూనే తిరస్కరణ...

పుల్వామా దాడిని చైనా ఖండిస్తూనే వక్రబుద్ధి చూపించింది. ఉగ్రవాదాన్ని సంహించేది లేదని ప్రకటిస్తూనే అజార్​పై నిషేధం విషయంలో వెనుకడుగు వేసింది. ఉగ్రవాదాన్ని నిర్మూలనకు ఎప్పుడూ కృషి చేస్తామనే ప్రకటనతో సరిపెట్టింది.

''భద్రతా మండలి జాబితాలో జేఈఎం కూడా ఉంది. ఈ విషయంలో ఆంక్షలు విధించేందుకు చైనా నిర్మాణాత్మకంగా, బాధ్యతాయుత పద్ధతిని అవలంబిస్తోంది.''

- చైనా విదేశాంగ మంత్రి గెంగ్​ షుయాంగ్​

ఐరాస భద్రతా మండలి మీడియా సంయుక్త సమావేశంలో చైనా... పుల్వామా ఉగ్రదాడి ఘటనను ఖండించలేదు. మిగతా సభ్య దేశాలన్నీ కలిసి ఇలాంటి ఉగ్రదాడులను సహించేది లేదంటూ ప్రకటించాయి.

అజార్​పై 3 దేశాల గుర్రు

తాజాగా ఐరాసలో వీటో అధికారమున్న అమెరికా, బ్రిటన్​, ఫ్రాన్స్ భద్రతామండలిలో మసూద్​ పేరును మళ్లీ తెరపైకి తెచ్చాయి. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాల్సిందేననే ప్రతిపాదనను మండలి ముందుంచాయి. 10 పనిదినాల్లోగా ఈ అంశాన్ని తేల్చాల్సుంటుంది.

అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు, ఆస్తులు- ఆయుధాల స్వాధీనం వంటి కీలక ప్రతిపాదనలను ప్రవేశపెట్టాయి. ఫలితంగా, ఒకసారి అజార్​పై నిషేధం అమలైతే అతని ఉగ్రకార్యకలాపాలకు ఎలాంటి నిధులందే అవకాశం ఉండదు.

ఫ్రాన్స్​ కీలకం...

ఈ ఏడాది మార్చిలో యూఎన్​- భద్రతా మండలి అధ్యక్ష పదవి ఫ్రాన్స్​ను వరిస్తుంది. రొటేషన్​ పాలసీ ప్రకారం ఫ్రాన్స్​కు ఈ అవకాశం దక్కనుంది. ఇదేమైనా కలిసొస్తుందేమో వేచిచూడాలి. అధ్యక్ష పదవి దక్కిన వెంటనే ఫ్రాన్స్​ ఈ అంశంపైనే కీలక దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

ఫ్రాన్స్​ ఎప్పుడూ భారత్​కు మద్దతుగానే నిలవటం సానుకూలాంశం. పుల్వామా ఆత్మాహుతి దాడిలో 'జేఈఎం' బాధ్యులుగా ప్రకటించుకున్న కారణంగా చైనాపైనా మరింత ఒత్తిడి పెరిగింది. ప్రతిపాదనకు అంగీకరించాల్సిందేనని అంతర్జాతీయ సమాజం పట్టుబట్టే పనిలో ఉంది.

మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే రోజు దగ్గరపడిందా..? చైనా ఈసారైనా వెనక్కితగ్గుతుందా...? జేఈఎం పని అయిపోయినట్లేనా..? అనేది మరో 10 రోజుల్లో ఒక కొలిక్కి వచ్చే అవకాశముంది.

ABOUT THE AUTHOR

...view details