తెలంగాణ

telangana

ETV Bharat / international

లాక్​డౌన్​ ముగిశాక 'వుహాన్​' ప్రజలు ఏం చేస్తున్నారు? - వుహాన్

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్​ పుట్టినిల్లు వుహాన్​లో 76 రోజుల లాక్​డౌన్​ నుంచి ప్రజలకు విముక్తి లభించింది. ఆంక్షలను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా నగరంలోని భవనాలను రంగురంగుల దీపకాంతులతో ముస్తాబు చేశారు.

Wuhan
76 రోజుల లాక్​డౌన్​ తర్వాత 'వుహాన్​' ప్రజలు ఏం చేస్తున్నారు?

By

Published : Apr 8, 2020, 12:44 PM IST

Updated : Apr 8, 2020, 4:29 PM IST

లాక్​డౌన్​ ముగిశాక 'వుహాన్​' ప్రజలు ఏం చేస్తున్నారు?

కరోనా మహమ్మారికి కేంద్ర బిందువైన వుహాన్​ నగరంలో లాక్​డౌన్​ ఎత్తివేసింది చైనా ప్రభుత్వం. పూర్తిస్థాయిలో ఆంక్షలను సడలించింది. 76 రోజుల నిర్బంధం నుంచి 11 మిలియన్ల వుహాన్​వాసులకు విముక్తి లభించింది. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు అనుమతి లభించటం వల్ల అక్కడి ప్రజల్లో ఆనందానికి అవధులు లేవు. వుహాన్​ నగరానికి ఇది ఒక గొప్ప రోజుగా భావిస్తున్నారు.

అయితే.. తాజాగా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ లాక్​డౌన్​ ఎత్తివేయటం వల్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వెయ్యి కేసులు నమోదయ్యాయి. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

కాంతులమయం..

లాక్​డౌన్​ ఎత్తివేసిన క్రమంలో వందల మంది ప్రజలు వీధుల్లోకి చేరి సంబరాలు చేసుకున్నారు. నగరమంతా పండగ వాతావరణం నెలకొంది. 'వుహాన్​ లెట్స్​ గో' అంటూ నినాదాలు చేస్తూ.. వీధుల్లో ర్యాలీలు తీశారు ప్రజలు. కరోనా వైరస్​పై పోరులో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా.. యాంగేట్జ్​ నదికి ఇరువైపుల ఉన్న ఆకాశహర్మ్యాలు, ఏడు వంతెనలను రంగురంగుల విద్యుత్తు దీపాలతో అలంకరించి లైట్​ షో నిర్వహించారు. వైద్యులు, పోలీసులు, ఇతర విభాగాల సిబ్బంది చిత్రాలను భవంతులపై ప్రదర్శించి కృతజ్ఞతలు తెలిపారు.

టోల్​గేట్ల వద్ద రద్దీ..

రోడ్డు, రైలు, వాయు వార్గాల్లో ప్రయాణాలపై నిషేధం ఎత్తివేసింది చైనా. ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్య ధ్రువీకరణ పత్రం ఉన్నవారు ప్రయాణాలు చేసేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ చర్యతో వేల మంది ప్రజలు ఇతర నగరాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. జాతీయ రహదారులపై ఉన్న టోల్​గేట్ల వద్ద రద్దీ పెరిగింది. కిలోమీటర్ల మేర కార్లు నిలిచిపోయాయి. ఉత్తర వుహాన్​లోని ఫుహే టోల్​గేట్​ వద్ద అర్ధరాత్రి బారికేడ్లను తొలగించి రాకపోకలకు అనుమతించారు.

వుహాన్​ నుంచి జింగ్జౌ నగరానికి వెళ్లాల్సిన తొలి రైలు ఉదయం 6 గంటలకు హాంకౌ స్టేషన్​ నుంచి బయలుదేరింది. హుబే వెలుపలి ప్రాంతాలకు మొత్తం 276 రైళ్లు నడపనున్నారు. వుహాన్​ విమానాశ్రయం నుంచి స్వదేశీ విమానాలను ప్రారంభించారు. తొలి విమానంలో 48 మంది ప్రయాణించారు. సుమారు 200 విహాంగాలను నడపనున్నట్లు సమాచారం.

9 రాష్ట్రాల్లో తరగతుల ప్రారంభం..

ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉన్న విద్యార్థుల కోసం దేశంలోని తొమ్మిది రాష్ట్రాలు, ప్రాంతాల్లో తరగతులను ప్రారంభించింది ప్రభుత్వం. హెనాన్​ రాష్ట్రంలో తొలి రోజు సుమారు 6.90 లక్షల మంది విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వైరస్​ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టారు అధికారులు. ప్రత్యేక బస్సులు నడపటం, పాఠశాలలు, కళాశాలల్లో భౌతిక దూరం పాటించటం, విద్యార్థులు మాస్కులు ధరించేలా చూస్తున్నారు. ఈ దిశగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు.

ఇదీ చూడండి:కరోనా భయాలు బేఖాతరు- అమెరికాలో యథావిధిగా ఎన్నికలు

Last Updated : Apr 8, 2020, 4:29 PM IST

ABOUT THE AUTHOR

...view details