ఓ వైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయాన్ని అమెరికా కాంగ్రెస్ ధ్రువీకరించిన రోజునే.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.ఈ మేరకు పార్టీ కీలక నేతలతో నిర్వహించిన భేటీలో ఈ విషయాన్ని ప్రకటించారు. అమెరికా- ఉత్తర కొరియా అణు ఒప్పందంపై ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో కిమ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. "దేశ రక్షణ సంబంధిత వ్యవహారంలో సైనిక సామర్థ్యాలు పటిష్ఠంగా ఉండాలి. దీనికోసం మనం మరింత కృషి చేయాలి" అని కిమ్ చెప్పినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉత్తర కొరియాతో అణు ఒప్పందంపై చర్చలతో ముందుకెళ్లారు. అయితే ఇరుదేశాల మధ్య పొత్తులు కుదరకపోవడం వల్ల 2019లో అమెరికా, ఉత్తరకొరియా మధ్య అణ్వాయుధ అంశంపై జరిగిన చర్చలు విఫలమయ్యాయి. మరోవైపు ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల ప్రచారంలో నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్.. కిమ్ జోంగ్ ఉన్‌ను 'దుండగుడు'గా పేర్కొన్నారు. దీనిని బట్టి బైడెన్‌కు కిమ్‌పై వ్యతిరేక దృక్పథం ఉందని చెప్పుకోవచ్చు. అధ్యక్షుడిగా పూర్తి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది మరింత ఎక్కువైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే ఉత్తర కొరియా తన సైనికబలాన్ని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఏ చిన్న గొడవ వచ్చినా అణుయుద్ధానికి దిగుతామని హెచ్చరించే కిమ్.. బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఆ పదాన్నే వాడలేదట. ఎందుకంటే ట్రంప్‌లా కాకుండా బైడెన్ చాలా కఠినంగా వ్యవహరిస్తారనే ఉద్దేశంతోనే మౌనంగా ఉంటున్నట్లు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.