ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అణ్వాయుధ, ఖండాంతర క్షిపణి పరీక్షలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. అణు పరీక్షలపై తాము విధించుకున్న స్వీయ నిషేధంతో ఇక ఎలాంటి అవసరం లేదని స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్ మధ్య అణ్వాయుధ నిరాయుధీకరణ ప్రధానాంశంగానే ఇప్పటివరకు చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చల్లోకొంత మేరకే పురోగతి నమోదయింది. అమెరికా తమపై విధించిన ఆంక్షలను సడలించాలని డిమాండ్ చేస్తూ 2019 చివరినాటికి గడువు విధించింది కిమ్ ప్రభుత్వం. అయితే అగ్రరాజ్యం దీనిపై ఎలాంటి జవాబివ్వని కారణంగానే కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.