తెలంగాణ

telangana

ETV Bharat / international

'ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టి పెట్టండి' - భారత్ చైనా సమస్య

సరిహద్దులో శాంతి నెలకొంటేనే చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమవుతాయని భారత్ చెబుతున్న వేళ.. డ్రాగన్ కీలక ప్రకటన చేసింది. సరిహద్దు సమస్యను 'సరైన స్థానం'లో ఉంచాలని సూచించింది. ముందు.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి చర్చలు జరపాలని పేర్కొంది.

china
'సరిహద్దు కాదు.. ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టి పెట్టండి'

By

Published : Apr 21, 2021, 10:58 PM IST

వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి, సుస్థిరతలను కొనసాగించేందుకు తాము కట్టుబడి ఉన్నామని చైనా స్పష్టం చేసింది. సరిహద్దు సమస్యను 'సరైన స్థానం'లో ఉంచాలని, ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధి కోసం చర్చలు జరపాలని పిలుపునిచ్చింది.

సరిహద్దులో శాంతి నెలకొంటేనే.. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతాయని భారత్ పదేపదే స్పష్టం చేస్తున్న నేపథ్యంలో చైనా తాజా ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడిన చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్​బిన్.. సరిహద్దు సమస్య పరిష్కారానికి ఇరుపక్షాలు లోతైన చర్చలు జరిపాయని చెప్పారు. తూర్పు లద్దాఖ్​లో మిగిలిన ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై చర్చించినట్లు వివరించారు.

ఇదీ చదవండి-'వెనక్కి తగ్గితేనే ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ'

"చైనా-భారత్ సరిహద్దు సమస్యపై చైనా వైఖరి స్పష్టంగా, స్థిరంగా ఉంది. దేశ సమగ్రత, భద్రతను కాపాడుతూ సరిహద్దులో శాంతి, సుస్థిరతలను కొనసాగించేందుకు చైనా కట్టుబడి ఉంది. ఇటీవల.. దౌత్య, సైనిక మాధ్యమాల ద్వారా చైనా, భారత్ సంప్రదింపులు జరిపాయి. చైనా-భారత్ దీర్ఘకాల సంబంధాలను దృష్టిలో పెట్టుకొని మాతో పనిచేసేందుకు భారత్ ముందుకొస్తుందని ఆశిస్తున్నాం. సరిహద్దు సమస్యను సరైన స్థానంలో ఉంచి.. ఇరుదేశాల సంబంధాలను మళ్లీ గాడిన పెడుతుందని భావిస్తున్నాం."

-వాంగ్ వెన్​బిన్, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి

తూర్పు లద్దాఖ్​లో మిగిలిన ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ ఎందుకు చేపట్టడం లేదన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఇరుదేశాలు ఇందుకోసం చర్చలు జరుపుతున్నాయని చెప్పారు. ఇందుకోసం కుదిరిన ఒప్పందాలను భారత్ పాటిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details