2015లో కెనడా ప్రముఖ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ విడుదల చేసిన 'ఐ విల్ షో యూ' పాట గుర్తుంది కదా... అందులో అందరికీ కనువిందు చేసిన ప్రకృతి రమణీయ దృశ్యాలను అంత తొందరగా ఎవరూ మరచిపోలేరు. ఈ పాట కారణంగా ఇప్పుడు దక్షిణ ఐస్లాండ్లోని 'జాద్రాల్జుఫర్ కాన్యాన్' సుందర ప్రాంతాన్ని చూసేందుకు యాత్రికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
విన్యాసాలు చేయాలని..
పాట చిత్రీకరణలో భాగంగా కొండ చివరి అంచుల్లో జస్టిన్ బీబర్ చేసిన విన్యాసాలను తామూ చేయాలని... ప్రభుత్వ హెచ్చరికలను సైతం పెడచెవిన పెడుతున్నారు. లోయ చివరకు వెళ్లడం ప్రమాదకరమని చెప్పినా పట్టించుకోవట్లేదు. అంతేకాదు పెద్ద సంఖ్యలో వస్తున్న యాత్రికులతో అక్కడి వృక్షసంపద దెబ్బతింటున్న కారణంగా కాలినడక మార్గాలను మూసివేశారు అధికారులు. అయినప్పటికీ జాద్రాల్జుఫర్ కాన్యాన్కు సందర్శకుల తాకిడి తగ్గలేదు.
గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇక్కడే..
జస్టిన్ బీబర్ లాగా పచ్చిక కొండల అంచుల్లో కూర్చుని ఫోటోలు దిగేందుకు, ఇక్కడి నదిలోని చల్లని నీటిలో కాసేపు జలకాలు ఆడేందుకు అక్కడి కాపలాదారుడికి లంచాలు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు పర్యటకులు. ప్రముఖ వెబ్ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' చివరి సీజన్ ఇక్కడే చిత్రీకరించడం... యాత్రికుల తాకిడికి మరో కారణం.