నతాంజ్‌లోని అణు కర్మగారంపై ఇటీవల జరిగిన దాడికి కారకుడిగా భావిస్తున్న ఓ అనుమానితుడి పేరును ఇరాన్ బయటపెట్టింది. ఈ దాడి జరగడానికి కంటే ముందు సదరు వ్యక్తి తమ దేశాన్ని వదిలి వెళ్లాడని చెప్పింది. ఈ మేరకు 43ఏళ్ల రేజా కారిమిని అనుమానితుడిగా పేర్కొంటూ అక్కడి ప్రభుత్వ మీడియా(స్టేట్ టీవీ) కథనం వెలువరించింది. కాషన్ నగరంలో అతడు జన్మించినట్లుగా చెప్పింది. అతడి పాస్‌పోర్ట్ ఫొటోను విడుదల చేసింది.
అయితే.. అత్యంత భద్రతా ఏర్పాట్లు ఉన్న నతాంజ్ అణుకర్మాగారంలోకి రేజా కారిమి ఎలా వెళ్లాడనే దానిపై 'స్టేట్ టీవీ' స్పష్టతనివ్వలేదు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న కారిమిని అరెస్టు చేసేందుకు వీలుగా అతడిపై 'రెడ్ నోటీసు'ను ఇరాన్ ప్రభుత్వం జారీ చేసినట్లు చెప్పింది. కారిమిని తిరిగి ఇరాన్‌కు రప్పించేందుకు అక్కడి ప్రభుత్వం అధికారిక చర్యలను చేపట్టినట్లు వెల్లడించింది.