కశ్మీర్‌పై తన ప్రచారానికి పెద్దగా ఆదరణ లభించలేదని అంగీకరించిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. కశ్మీర్లో పరిస్థితులను అంతర్జాతీయ సమాజం గమనిస్తుందనే విశ్వాసం ఉందని ఉద్ఘాటించారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత వ్యతిరేక వాక్చాతుర్యాన్ని కొనసాగించారు ఖాన్. ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు.
సరిహద్దు తీవ్రవాదంపై కఠిన చర్యలు తీసుకొనేవరకు పాకిస్థాన్‌తో చర్చలు పునరుద్ధరించే ప్రసక్తే లేదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది.
మార్కెట్‌గా చూస్తోంది..
ప్రపంచ దేశాల నాయకులు భారత్‌ను ఒక పెద్ద మార్కెట్‌గా చూస్తున్నారని ఆరోపించారు ఇమ్రాన్. 100కోట్లకు పైగా జనాభా కలిగిన దేశం, వాణిజ్య పరంగా ఎంతో ఉపయోగపడుతుందని వారు భావిస్తున్నారని అందుకే కశ్మీర్ అంశంలో మాట్లాడలేకపోతున్నారని పేర్కొన్నారు.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా న్యూయార్క్ పర్యటనలో కశ్మీర్‌లోని పరిస్థితులను అంతర్జాతీయ నాయకులకు వివరించినట్లు చెప్పారు ఇమ్రాన్. కశ్మీర్ అంశంలో ప్రధాని మోదీ మధ్యవర్తిత్వాన్ని తిరస్కరిస్తున్నప్పటికీ.. ద్వైపాక్షిక అంశమేనని ఉద్ఘాటించారు.