తెలంగాణ

telangana

ETV Bharat / international

ఒక్కసారి వాడి పడేసే రక్కసిని ఇకనైనా ఏరిపారేద్దాం! - india plastic ban

1970లో ప్లాస్టిక్​ పురుడు పోసుకున్న కాలంలో అదో గొప్ప ఆవిష్కరణ. కానీ, ఇప్పుడు మానవాళి మనుగడకే పెనుముప్పుగా తయారైంది. అందులోనూ ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్​ సంచులు, ఆహార డబ్బాలు పర్యావరణం పీకలపై కూర్చుని ఊపిరాడనీయట్లేదు. అందుకే 'అంతర్జాతీయ ప్లాస్టిక్​ బ్యాగ్​ రహిత దినం' పుట్టింది.

international-plastic-bag-free-day etv bharat telugu story
ఒక్క సారి వాడి పడేసే రక్కసిని.. ఇకనైనా ఏరిపారేద్దాం!

By

Published : Jul 3, 2020, 5:27 PM IST

Updated : Jul 3, 2020, 5:44 PM IST

మన ముందు తరం వారు.. బయటికి వెళ్లేటప్పుడు కూడా ఓ వస్త్రంతో కుట్టిన సంచిని తీసుకెళ్లేవారు. వస్తూ, వస్తూ అనుకోకుండా ఏమైనా కొనాల్సివస్తే.. ఆ సంచిలో వేసుకుని ఇంటికి తెచ్చుకునేవారు. మరిప్పుడు.. ఇంటి నుంచి సంచి తీసుకెళ్లాలంటే నామోషి. ఇంత అభివృద్ధి చెందాం.. మనం సంచి మోయడమేంటీ అని బడాయి కాబోలు. ఉత్తి చేతులతోనే షాపింగ్​కు వెళతాం. కూరగాయలు కొంటాం.. సరుకుకో ప్లాస్టిక్​ బ్యాగు తీసుకొని ఇంటికి మోసుకొస్తాం. ఒక్క సారి వాడి పడేసే ప్లాస్టిక్​ రక్కసిని ఇలా పెంచిపోషిస్తున్నాం.

మనం ఏడాదికి కనీసం 1-5 ట్రిలియన్ల ప్లాస్టిక్​ బ్యాగులు వాడుతున్నాం.. కాదు, కాదు వాడి పడేస్తున్నాం. అంటే ఒక్క సెకనుకు దాదాపు 1,60,000 ప్లాస్టిక్​ బ్యాగుల, ప్లాస్టిక్​ డబ్బాలు, గ్లాసుల వ్యర్థాలు నేలపై పేరుకుపోతున్నాయి. సగటున ఏటా ఒక్క మనిషి కనీసం 700 ప్లాస్టిక్​ క్యారీబ్యాగులను వాడి కాలుష్యాన్ని పెంచుతున్నాడు.

వీటిలో కేవలం మూడంటే, మూడు శాతం మాత్రమే రీసైకిల్​ అవుతోంది. మిగిలినదంతా ఎక్కడికి పోతోంది? మనం దశాబ్దాలుగా పెంచుకుంటున్న కాలుష్య భూతానికి ఊతమిచ్చేందుకు నేలపై, నీటిలో కలుస్తోంది. వేలాది జల జీవులు, జంతువుల ప్రాణాలు బలిగొంటోంది.

అందుకే.. ఈ ప్లాస్టిక్​ బ్యాగుల భూతాన్ని తరిమి కొట్టి, పర్యావరణహిత ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను గుర్తుచేసుకునేందుకు.. ఏటా 'అంతర్జాతీయ ప్లాస్టిక్​ రహిత దినం' జరుపుకుంటున్నాం.

ప్లాస్టిక్​ బ్యాగులు ఎందుకొద్దు?

  • ప్లాస్టిక్​ భూమిలో, నీటిలో కరగదు. కాబట్టి.. నేల కలుషితమవుతోంది. గాలికి ఎగిరి డ్రైనేజీల్లో చిక్కుకుని నగరాల్లో నానా సమస్యలకు దారితీస్తున్నాయి.
  • ప్లాస్టిక్​ను కృత్రిమంగా అంతం చేయాలన్నా ప్రమాదమే. చెత్తలో కలిపి వీటిని సూర్యరశ్మితో గానీ, నిప్పు అంటించి గానీ నాశనం చేస్తే... ఫురాన్​, డియోక్సిన్ వంటి విషవాయువులను విడుదల చేస్తాయి. దీంతో ప్రజలకు అనారోగ్యం చేరువవుతోంది.
  • ప్లాస్టిక్​ సంచులు ఇరుక్కుంటే డ్రైనేజీలో మురుగు నీరు నిలిచిపోతుంది. ఫలితంగా మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు కలిగించే దోమలు , క్రిములు పుట్టుకొస్తాయి.
  • వేల ఏళ్ల వరకు కరగని ఈ ప్లాస్టిక్​ సంచులు, కంటైనర్లను పొరపాటున మూగజీవాలు తినేస్తున్నాయి. దీంతో ఏటా వందలాది జంతువులు, తాబేళ్లు, డాల్ఫిన్​ వంటి జీవులు ప్రాణాలు విడుస్తున్నాయి.
  • ప్లాస్టిక్​ కంటైనర్లలో నిల్వచేసిన ఆహారాన్ని తినేటప్పుడు/తాగేటప్పుడు.. వాటిలో ఉన్న ప్రమాదకరమైన టాక్సిక్​ రసాయనాలు మన జీర్ణాశయంలోకి వెళ్తాయి. ఫలితంగా ఊపిరితిత్తులు, నరాలు, జననాంగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది.

భారత్​లో ప్లాస్టిక్ బ్యాగులు...

  • 1998లో భారత్​లో తొలిసారిగా సిక్కిం రాష్ట్రం ప్లాస్టిక్​ బ్యాగులపై నిషేధం విధించింది. రెండు దశాబ్దాల కృషి వల్ల ఇప్పుడు ఆ ఒక్క రాష్ట్రంలో మాత్రమే ప్లాస్టిక్​ విజయవంతంగా రద్దయింది.
  • ఆ తర్వాత దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్​పై నిషేధం విధించాయి ప్రభుత్వాలు. కానీ, ఆచరణ మాత్రం అంతంత మాత్రమే.
  • పూర్తి స్థాయి నిషేధం అమలు చేయడానికి .. సరైన ప్రత్యామ్నాయాలు లేకపోవడమే ప్లాస్టిక్​ నిషేధానికి ప్రధాన అవాంతరం.
  • ఆంధ్రప్రదేశ్​, గుజరాత్​, జమ్ముకశ్మీర్​, కేరళ, బంగాల్​ రాష్ట్రాలు ప్లాస్టిక్​పై పాక్షిక నిషేధం విధించాయి. మిగిలిన 18 రాష్ట్రాల్లో పూర్తి స్థాయి నిషేధం విధించినట్లు జాతీయ కాలుష్య నియంత్రణ బోర్డ్ ​(సీపీసీబీ) తెలిపింది.
  • భారత ప్రధాని నరేంద్ర మోదీ 2022 వరకల్లా.. ఒక్కసారి వాడిపడేసే ప్లాస్టిక్​ను దేశం నుంచి తరిమి కొడతామని ప్రకటించారు.

ఇదీ చదవండి:'ప్లాస్టిక్​పై వేటేద్దాం.. విస్తరాకుకే ఓటేద్దాం!'

Last Updated : Jul 3, 2020, 5:44 PM IST

ABOUT THE AUTHOR

...view details