వందల కొద్దీ దీవులున్న ఇండోనేసియాలో ఎన్నికలు ప్రశాంతంగానే ముగిశాయి. మొత్తం 80 శాతంపైగా పోలింగ్ నమోదైంది. స్థానిక, పార్లమెంటరీ, అధ్యక్ష ఎన్నికలన్నింటినీ ఒకే సారి ఏప్రిల్ 17న నిర్వహించారు.
బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఆ ఓటింగ్లో అసలు తతంగం తర్వాత మొదలైంది. అదే లెక్కింపు. అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించగా... ఒక్కో ఓటరు 5 ఓట్ల వరకు వేయాల్సి వచ్చింది. ఆ ఓట్లన్నింటినీ అధికారులు స్వయంగా చేతితోనే లెక్కపెట్టాలి. అందుకు ఎంతో మంది సిబ్బంది అవసరం. అయితే.. తగిన ఏర్పాట్లు చేయడంలో మాత్రం విఫలమైంది ఎన్నికల సంఘం.
వందలాది ఓట్లను తక్కువ సిబ్బందితోనే లెక్కించడం వలన అలసటకు గురయ్యారు. ఏకంగా 272 మంది మృతిచెందారు. మరో 1878 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరందరికీ మెరుగైన వైద్యసేవలు అందించాలని ఇండోనేసియా వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.