భారతీయ మూలాలున్న సింగపూర్ రాజకీయ నేత ప్రీతం సింగ్(43) సరికొత్త చరిత్ర లిఖించారు. ఆ దేశ పార్లమెంటు ప్రస్థానంలోనే తొలి ప్రతిపక్ష నేతగా నిలిచారు. ఈ మేరకు పార్లమెంటులో సోమవారంబాధ్యతలు స్వీకరించారు.
సింగపూర్ పార్లమెంట్లో ప్రీతం కొత్త చరిత్ర
భారతీయ మూలాలున్న సింగపూర్ రాజకీయ నేత... ఆ దేశ పార్లమెంట్ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించారు. తొలి ప్రతిపక్ష నేతగా అవతరించారు. సోమవారం ఈ బాధ్యతలు స్వీకరించారు.
ప్రీతం ప్రాతినిధ్యం వహిస్తున్న వర్కర్స్ పార్టీ జులై 10న పార్లమెంటులోని 93 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 10 స్థానాలు గెలుచుకుంది. ఇప్పటివరకూ ఆ దేశంలో ప్రతిపక్ష పార్టీకి ఇన్ని సీట్లు రావడం ఇదే ప్రథమం. దీంతో ప్రతిపక్ష నేత హోదాను పార్లమెంటు కట్టబెట్టింది. సభలో అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ పక్ష నేత ఇంద్రాణీ రాజాహ్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఈమె కూడా భారతీయ మూలాలున్న నేత కావడం గమనార్హం.
ప్రీతం సభలో మాట్లాడుతూ విదేశీయుల జీవన స్థితిగతులపై ప్రభుత్వం దృష్టిసారించాల్సిన ఆవశ్యకతపై ప్రస్తావించారు. "విదేశీయుల ఉనికి వల్ల సింగపూర్ ఆర్థికవ్యవస్థ బలపడుతుంది. తద్వారా స్వదేశీయులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించొచ్చు" అని ప్రీతం పేర్కొన్నారు .