తెలంగాణ

telangana

ETV Bharat / international

తల్లి అంత్యక్రియలకు పంపలేదని సహోద్యోగిపై దాడి - దుబాయి

తన తల్లి అంత్యక్రియలకు పంపించేందుకు పనిచేసే సంస్థ అంగీకరించలేదన్న కోపంతో దుబాయిలో తన సహోద్యోగిపై కత్తితో దాడి చేశాడు ఓ వ్యక్తి. 11 సార్లు పొట్ట, ఛాతీ భాగంలో దాడి చేయటం వల్ల తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు బాధితుడు. ఈ సంఘటనలో ఇద్దరూ భారతీయులే కావటం గమనార్హం.

Indian man in UAE stabs compatriot
సహోద్యోగిపై కత్తితో దాడి

By

Published : Dec 18, 2020, 4:51 AM IST

ఉపాధి నిమిత్తం దుబాయి వెళ్లిన ఓ వ్యక్తి తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు తన సంస్థ అనుమతించలేదనే కోపంతో సహోద్యోగిపై కత్తితో దాడి చేశాడు. 11 సార్లు పొట్ట, ఛాతి భాగంలో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక్కడ ఇద్దరు భారతీయులే కావటం గమనార్హం.

ఈ ఏడాది ఆగస్టులో తమ నిర్మాణ సంస్థ 22 మందిని భారత్​కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోందని ఉద్యోగులకు సమాచారం ఇచ్చాడు బాధితుడు. ఆ జాబితాలో తన పేరు లేకపోవటంపై ఆగ్రహించిన నిందితుడు దాడికి పాల్పడినట్లు కోర్టు విచారణలో తేలిందని గల్ఫ్​ మీడియా పేర్కొంది. అయితే.. సంస్థ, బాధితుడు, నిందితుల పేర్లను వెల్లడించలేదు.

"భారత్​కు పంపించే జాబితాలో తన పేరు ఎందుకు లేదని తేలుసుకోవాలనుకున్నాడు నిందితుడు. తన తల్లి అనారోగ్యంగా ఉందని, ఇంటికి వెళ్లాలని నాతో చెప్పాడు. ఇది తన నిర్ణయం కాదని అతనితో చెప్పాను. తర్వాతి రోజు తన తల్లి చనిపోయిందని తెలిపాడు. కోపంతో తన గదికి వెళ్లాడు. కొద్ది సమయం తర్వాత కత్తితో తిరిగి వచ్చి నాపై 11 సార్లు దాడి చేశాడు. పొట్ట, ఛాతీపై తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నాడు"

- బాధితుడు

బాధితుడు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడినట్లు మీడియా వెల్లడించింది. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దుబాయి పోలీసులు అరెస్ట్​ చేసినట్లు తెలిపింది.

ఈ కేసులో తదుపరి విచారణను 2021, జనవరి 10కి వాయిదా వేసింది కోర్టు.

ఇదీ చూడండి:నన్ను మాట్లాడనివ్వలేదు: స్పీకర్​కు​ రాహుల్​ లేఖ

ABOUT THE AUTHOR

...view details