ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని జయించింది నాలుగేళ్ల చిన్నారి. చిరుప్రాయంలోనే ప్రాణాంతక క్యాన్సర్‌పైనా విజయం సాధించింది. ఏప్రిల్ 1న వైరస్ లక్షణాలతో దుబాయ్‌లోని అల్ ఫతేమ్ హెల్త్ హబ్ ఆస్పత్రిలో చేరింది భారత్‌కు చెందిన శివాని. 20న కోలుకుని డిశ్చార్జ్ అయింది. ఇప్పుడు 14 రోజులు హోం క్యారంటైన్లో ఉండనుంది. క్యాన్సర్‌పై పోరాడిన తర్వాత రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పటికీ చిన్నారి ప్రాణాలతో బయటపడినట్లు వైద్యులు తెలిపారు.
తల్లి నుంచి..
శివాని తల్లి దుబాయ్‌లో ఆరోగ్య కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్నారు. మొదట ఆమెకే వైరస్ సోకింది. ఎలాంటి లక్షణాలు లేకపోయినా ఆమె భర్తకు, బిడ్డకు వైద్య పరీక్షలు నిర్వహించారు. భర్తకు నెగిటివ్ వచ్చింది. శివానికి పాజిటివ్‌గా తేలింది. శివాని తల్లి కూడా కోరానా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. త్వరలోనే డిశ్చార్జ్ అవుతారు. వీరిద్దరికీ ఒకే వార్డులో చికిత్స అందించారు. శివాని గతంలో క్యాన్సర్ బాధితురాలు అయినందు వల్ల ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నారు వైద్యులు.