Imran Khan On India: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. హఠాత్తుగా భారత్‌పై ప్రశంసలు కురిపించారు. భారత విదేశాంగ విధానం ఉత్తమమైనదని, స్వతంత్రమైనదన్నారు. ప్రజల అభ్యున్నతి కోసమే అది పనిచేస్తోందని ప్రశంసించారు. ఖైబర్ పఖ్తూంక్వాలోని మలాకండ్ ప్రాంతంలో బహిరంగ సభలో ఇమ్రాన్ ఖాన్ పాల్గొని ప్రసంగించారు.
''ఐరోపా సమాఖ్య దేశాల రాయబారుల కోసం చెబుతున్నాను వినండి. ఏ రాయబారికి ఒక దేశ విదేశాంగ విధానంపై బహిరంగంగా మాట్లాడే హక్కు లేదు. ఐరోపా సమాఖ్య రాయబారులు రష్యాపై నిషేధం విధించాలని పాకిస్థాన్‌ను కోరారు. మీరు భారత్‌ను కూడా ఇలానే అడగగలరా అని నేను వారితో అన్నాను. భారత్‌తో ఇదే మాట అంటే వారి పరువు పోతుంది. మేము(పాకిస్థాన్) వారికి(ఐరోపా దేశాలకు) ఏమన్నా బానిసలమా? పాకిస్థాన్ విదేశాంగ విధానం ప్రజల మేలు కోసం ఉండాలి. మన పొరుగుదేశం భారత్‌ను చూడండి. నేను భారతదేశాన్ని మెచ్చుకుంటాను. వాళ్ల(భారత) విదేశాంగ విధానం ఎప్పుడూ స్వతంత్రంగా ఉంటుంది. హిందుస్థాన్ వారితో కలిసి కూటమిగా ఉంది. క్వాడ్‌లో అమెరికా, భారత్ సభ్య దేశాలుగా ఉన్నాయి. అయినా సరే ఉక్రెయిన్ వ్యవహారంలో తటస్థంగా ఉన్నామని భారత్ చెబుతోంది. రష్యాపై ఆంక్షలు ఉన్నా సరే ఆ దేశం నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది. ఎందుకంటే భారత విదేశాంగ విధానం ఆ దేశ ప్రజల అభ్యున్నతి కోసం ఉంటుంది.''
-- ఇమ్రాన్‌ఖాన్, పాకిస్థాన్ ప్రధాన మంత్రి