పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్‌పై అక్కసును వెళ్లగక్కారు. భారత ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. ప్రధాని హోదాను మరిచి ఐక్యరాజ్యసమితి 74వ సర్వసభ్యసమావేశంలో విద్వేషభరితంగా ప్రసంగించారు. కశ్మీర్లో ముస్లింలు ఉగ్రవాదం వైపు మళ్లే అవకాశం ఉందంటూ తమ అసలు రంగు బయటపెట్టుకున్నారు.
ఐరాస సర్వసభ్య ప్రతినిధుల సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించిన తర్వాత ఇమ్రాన్ దాదాపు 50 నిమిషాలు మాట్లాడారు. 15 నిమిషాల సమయం ఇవ్వగా సుదీర్ఘంగా ఉపన్యసించారు. ప్రధాని పదవి చేపట్టాక ఐరాసలో ఇమ్రాన్ ఖాన్ చేసిన తొలి ప్రసంగం ఇదే. ఇందులో సగ భాగం కశ్మీర్‌పైనే మాట్లాడారు.
కశ్మీర్లో అమానవీయ కర్ఫ్యూ విధించారని, దాన్ని ఎత్తివేయాలని, నిర్బంధంలో ఉన్నవారిని విడుదల చేయాలని భారత్‌ను డిమాండ్ చేశారు. ఇరుగుపొరుగున ఉన్న అణ్వాయుధ దేశాల మధ్య ఘర్షణ మంచిదికాదని.. మరోమారు యుద్ధభాషణ చేశారు. దీని పరిణామాలు సరిహద్దులను దాటి ఉంటాయని హెచ్చరించారు. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించాలని.. ఇది ఐరాస ముందు ఉన్న అతిపెద్ద సవాలు అన్నారు.
మోదీపై విమర్శలు...
ఇమ్రాన్ తన ప్రసంగంలో ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇరు దేశాల సమస్యలపై చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నా.. మోదీ అంగీకరించడం లేదని ఆరోపించారు. పుల్వామా దుర్ఘటనకు తమని బాధ్యులను చేశారని ఆరోపించారు. ఆధారాలు అడిగితే తమపై బాంబులు వేశారన్నారు. అందుకు దీటుగా తాము బదులిచ్చామన్నారు.