తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్​ 'జెరూసలెం' ప్రతిపాదనపై మిశ్రమ స్పందన

ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం శాంతియుత పరిష్కారానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ చేసిన ప్రతిపాదనపై ప్రపంచ దేశాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముస్లిం దేశాల నుంచి విమర్శలు రాగా.. పలు ఐరోపా సమాఖ్య దేశాల నుంచి సానుకూల స్పందన వచ్చింది.

trump
ట్రంప్​ 'జెరూసలెం' ప్రతిపాదనపై మిశ్రమ స్పందన

By

Published : Jan 29, 2020, 11:16 AM IST

Updated : Feb 28, 2020, 9:26 AM IST

ఇజ్రాయెల్​-పాలస్తీనా వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ప్రతిపాదించిన 'పశ్చిమాసియా శాంతి ప్రణాళిక'పై ప్రపంచ దేశాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ ప్రతిపాదన పాలస్తీనీయులకు అన్యాయం చేసేలా ఉందని ముస్లిం దేశాలు విమర్శిస్తున్నాయి. దీనిని పరిశీలించవచ్చని పలు ఐరోపా సమాఖ్య దేశాలు అంటున్నాయి.

ఇజ్రాయెల్​-పాలస్తీనా మధ్య శాంతి స్థాపనే లక్ష్యంగా ఈ ప్రతిపాదన చేశారు ట్రంప్. ఇజ్రాయెల్ అవిభక్త రాజధానిగా జెరూసలెం ఉండాలని, తూర్పు జెరూసలెం పాలస్తీనా రాజధానిగా ఏర్పడాలని ప్రతిపాదించారు. దీనివల్ల ఇజ్రాయెల్​, పాలస్తీనా రెండింటికీ విజయం చేకూరుతుందన్నారు. ఇది చారిత్రక ఒప్పందం అవుతుందని ఇజ్రాయెల్ ప్రధానితో భేటీ అనంతరం చెప్పారు.

పాలస్తీనా విమర్శలు..

ట్రంప్ ప్రతిపాదన కుట్రపూరితంగా ఉందన్నారు పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్. దీనికి ప్రజలు అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తమ నాయకులంతా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని స్పష్టం చేశారు.

ఐరోపా దేశాల స్పందన..

ట్రంప్ శాంతి ప్రణాళికను అధ్యయనం చేస్తామని ఐరోపా సమాఖ్య ప్రతినిధి జోసెఫ్ బోరెల్ అన్నారు. ఇజ్రాయెల్​, పాలస్తీనా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చట్టబద్ధంగా ఈ సమస్యను పరిష్కరించాలని పేర్కొన్నారు.

ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య శాశ్వత శాంతికి ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన చర్చల ద్వారా 'రెండు దేశాల' ఏర్పాటే పరిష్కారమని ఐరోపా సమాఖ్య(ఈయూ)లో ముఖ్య దేశమైన జర్మనీ​ విదేశాంగ మంత్రి హైకో మాస్​ అభిప్రాయపడ్డారు.

ఈనెల 31న ఈయూ నుంచి వైదొలుగుతున్న బ్రిటన్​.. అమెరికా ప్రతిపాదనను పరిశీలించాలని సానుకూలంగా స్పందించింది.

ఐరాస స్పందన..

1967 యుద్ధానికి పూర్వం ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య జరిగిన శాంతి ఒప్పందాన్నే తాము గుర్తిస్తున్నామని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది. భద్రతా మండలి, అసెంబ్లీ తీర్మానాల ద్వారా 'రెండు దేశాల' పరిష్కారం నిర్వచించి ఉందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్స్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ అన్నారు.

రష్యా..

సమస్య పరిష్కారని ఇజ్రాయెల్, పాలస్తీనా నేరుగా చర్చలు జరపాలని రష్యా సూచిందింది. అమెరికా ప్రతిపాదన ఆమోదయోగ్యమో కాదో తాము అధ్యయనం చేయాల్సి ఉందని రష్యా విదేశాంగ శాఖ సహాయ మంత్రి మిఖైల్ బోగ్డనోవ్​ తెలిపారు.

టర్కీ ఖండన..

పాలస్తీనా భూభాగాన్ని దోచుకొని, 'రెండు దేశాల' ఒప్పందాన్ని నీరుగార్చడమే లక్ష్యంగా ట్రంప్ ప్రతిపాదన ఉందని టర్కీ పేర్కొంది.

ఇరాన్ విమర్శ...

అమెరికా రూపొందించిన శాంతి ప్రణాళిక అర్థ రహితంగా ఉందని ఇరాన్ వ్యాఖ్యానించింది. ఇది కచ్చితంగా విఫలమవుతుందని ఇరాన్ విదేశాంగ మంత్రి హెజ్బొల్లా అన్నారు.

ట్రంప్ ప్రతిపాదనను యునైటెడ్ అరబ్​ ఎమిరేట్స్ స్వాగతించింది. అమెరికా సమక్షంలో ఇరు దేశాలు చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలని ఈజిప్ట్ పేర్కొంది. 1967కు ముందు నాటి సరిహద్దుల ఆధారంగానే స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటే పరిష్కారమని జోర్డాన్ అభిప్రాయపడింది.

ఇదీ చూడండి: ముక్కు శస్త్రచికిత్సతో మూడేళ్లు తగ్గుతున్న వయసు!

Last Updated : Feb 28, 2020, 9:26 AM IST

ABOUT THE AUTHOR

...view details