అమెరికా నుంచి తనకు కావలసింది సాధించుకోవాలంటే దక్షిణ కొరియాపై ఒత్తిడి పెంచాలని, దాంతో అమెరికా దిగివస్తుందని ఉత్తర కొరియా మొదట నుంచి లెక్కవేసుకుంటోంది. ఈసారి ఆ పనిని సమర్థంగా చేయడానికి ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన సోదరి కమ్ యో జోంగ్‌ను (Kim Sister North Korea) రంగంలోకి దింపారు. యో జోంగ్‌ను కొన్ని రోజుల క్రితం ప్రభుత్వ వ్యవహారాల కమిటీ సభ్యురాలిగా నియమించడంతో... సోదరుడి తరఫున విదేశాంగ వ్యవహారాలను చక్కబెట్టే పనిని ఆమెకు అప్పగించినట్లు స్పష్టమైంది. యో జోంగ్ సామాన్యురాలు కాదు. ఒకవైపు శాంతి ప్రతిపాదనలు చేస్తూనే, రెండోవైపు ఆయుధ బలాన్ని ప్రదర్శించడం ఆమె ప్రత్యేకత.
అమెరికా, ఉత్తర కొరియాల (North Korea America Relationship) మధ్య అణ్వాయుధాలపై చర్చలు ప్రతిష్టంభించిన సమయంలోనే యో జోంగ్ తమ గడ్డపై దక్షిణ కొరియా నిర్మించిన సమన్వయ కార్యాలయాన్ని జూన్‌లో ధ్వంసం చేయించారు. ఉత్తర కొరియాతో బేషరతుగా చర్చలు జరపడానికి అమెరికా సిద్ధంగా ఉందని జో బైడెన్ ప్రకటించగా, యో జోంగ్ అందుకు మెలికలు పెట్టారు. తమ దేశంపై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేసి, దక్షిణ కొరియా-అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలకు స్వస్తి చెబితేనే చర్చలకు ఒప్పుకొంటామని యో జోంగ్ తెగేసి చెప్పారు. తరవాత దక్షిణ కొరియాతో షరతులతో కూడిన చర్చలు జరుపుతామని ప్రకటించారు. ఆరు నెలల తరవాత మొదటిసారిగా క్షిపణి పరీక్షలు నిర్వహించారు. ఆపై తన సోదరుడు కిమ్ అధ్యక్షతలోని ప్రభుత్వ వ్యవహారాల కమిటీలో సభ్యురాలిగా యో జోంగ్‌కు పదోన్నతి లభించింది. 30వ పడిలో ఉన్న యో జోంగ్‌ను ప్రస్తుతం ఉత్తర కొరియాలో కిమ్ తరవాత అత్యంత శక్తిమంతమైన నేతగా పరిగణించవచ్చని దక్షిణ కొరియా గూఢచారి సంస్థ పేర్కొన్నది. ఇక నుంచి అమెరికా, దక్షిణ కొరియాలతో జరిగే చర్చల్లో యో జోంగ్ ఉత్తర కొరియా అధికార ప్రతినిధిగా పాల్గొంటారని నిపుణుల అంచనా. బహుశా ఆమెను అమెరికాలో తమ ప్రత్యేక దూతగా కిమ్ నియమించినా ఆశ్చర్యం లేదు.