తెలంగాణ

telangana

ETV Bharat / international

'టియర్​గ్యాస్​'తో టేస్టీ 'ఐస్​క్రీం'.. తింటే ఉక్కిరిబిక్కిరి ఖాయం

హాంకాంగ్​లో గతేడాది మొదలైన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల పరిణామాలు.. అక్కడి ప్రజలకు చేదు అనుభవాలను మిగిల్చాయి. ప్రస్తుతం కరోనా కారణంగా ఆ ఆందోళనలు చల్లారినా... వాటిని మర్చిపోకూడదని ఓ ఐస్​క్రీం దుకాణదారుడు వినూత్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. నిరసనల సమయంలో పోలీసులు ప్రయోగించిన బాష్పవాయువు(టియర్​గ్యాస్​) రుచితో ఐస్​క్రీంను తయారు చేశాడు.

Hong Kong shop offers 'tear gas' flavor ice cream
'టియర్​గ్యాస్​'తో టేస్టీ 'ఐస్​క్రీం'... తింటే ఉక్కిరిబిక్కిరి ఖాయం

By

Published : May 16, 2020, 5:31 AM IST

హాంకాంగ్​లోని ఓ దుకాణంలో కొత్తగా తయారుచేసిన ఐస్​క్రీం.. ఇటీవలె నగరంలో జరిగిన ఉద్యమ పరిణామాలకు సాక్ష్యంగా మారింది. ఘాటు మిరియాలతో తయారైన ఈ చల్లని పదార్థం తిన్నవారు.. ఆందోళనల సమయంలో పోలీసులు ప్రయోగించిన బాష్పవాయువును గుర్తు చేసుకుంటున్నారు.

మిరియాలతో పాటు వసాబీ, ఆవాలను కలిపి తయారైన ఈ ఐస్​క్రీం... ఘాటైన రుచితో.. గొంతులో మంట, చికాకు కలిగిస్తోంది. ఫలితంగా కస్టమర్లకు నిరసనల నాటి అనుభవాలను కళ్లముందు ఉంచుతోంది.

ఐస్​క్రీం బాష్పవాయువు రుచిలా ఉంది. ఈ పదార్థాన్ని తిన్నప్పుడు ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టంగా అనిపించింది. గొంతులో ఎంతో మంట, చికాకు కలిగించింది. వెంటనే ఎక్కువగా నీరు తాగాలనిపించింది. నిరసనల సమయంలో నేను మర్చిపోలేని అనుభవాలను ఈ ఐస్​క్రీం రుచి గుర్తు చేసింది.

అనితా వాంగ్​, కస్టమర్​

ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాన్ని కొనసాగించాలని, ఇప్పటివరకు చోటుచేసుకున్న పరిణామాలను ప్రజలు మర్చిపోకూడదనే ఉద్దేశంతో... బాష్పవాయువు రుచితో ఐస్​క్రీంను తయారు చేసినట్లు దుకాణదారుడు తెలిపాడు.

ఐస్​క్రీంను నల్ల మిరియాలతో తయారు చేస్తాం. వాటిని వేయించి మెత్తగా చేసి, ఇటాలియన్​ తరహాలో జెలాటోగా మారుస్తాం. కాస్త ఘాటుగా ఉన్నప్పటికీ.. రుచి మాత్రం బాష్ప వాయువు పీల్చుకున్న అనుభూతినిస్తుంది.

దుకాణం యజమాని

ఈ రకమైన ఐస్​క్రీంను 5 డాలర్లకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితులు నెలకొన్న కారణంగా.. 20 నుంచి 30 స్కూబ్​ల వరకు కొనుగోలవుతున్నట్లు యజమాని వెల్లడించాడు.

'టియర్​గ్యాస్​'తో టేస్టీ 'ఐస్​క్రీం'... తింటే ఉక్కిరిబిక్కిరి ఖాయం

హింసాత్మకంగా మారిన ఘర్షణలు..

నేరస్థులను చైనాకు అప్పగించే బిల్లుకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం.. కొన్ని నెలల్లోనే తారస్థాయికి చేరుకుంది. ఈ ఆందోళనల్లో పోలీసులు, నిరసనకారుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలు.. హింసాత్మకంగా మారాయి. వారిని చెదరగొట్టేందుకు 16వేల రౌండ్లకు పైగా బాష్పాయువును ప్రయోగించారు పోలీసులు.

ప్రభుత్వం ఈ బిల్లు ఉపసంహరించుకున్నప్పటికీ.. చైనా నుంచి విముక్తి కావాలని కోరుతూ నిరసనలు కొనసాగాయి. ప్రస్తుతం నగరంలో కరోనా విజృంభిస్తుండటం వల్ల.. ఆందోళనలు దాదాపుగా చల్లబడ్డాయి. అయితే, ఈ వేసవిలో ప్రదర్శనకారులు పెద్దఎత్తున చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details