హాంగ్‌కాంగ్‌లో చైనా నిర్ణయాలకు వ్యతిరేకంగా విధ్వంసం సృష్టిస్తోన్న ఆందోళనలపై ఆ దేశ న్యాయనిపుణులు స్పందించారు. యువనిరసనకారులకు పలు హెచ్చరికలు జారీ చేశారు. వీలైనంత త్వరగా నిరసనలు విరమించాలని.. ఇకపై హింసాత్మక చర్యలకు పాల్పడితే సహించబోయేది లేదని తేల్చిచెప్పారు.
ఆందోళనకారులు ఇటీవలే విమానాశ్రయాన్ని ముట్టడించారు. ఫలితంగా అధికారులు విమాన సేవలను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలోనే సిబ్బందిపై దాడికి దిగి, ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారు ఆందోళనకారులు. విదేశీ పాత్రికేయునిపై దాడికీ పాల్పడ్డారు. ఈ పరిణామంపైనే న్యాయనిపుణులు స్పందించారు.
"కారణం ఏదైనా.. మీరు చేపట్టిన ఆందోళనలు అసాంఘిక చర్యలే. రాజ్యాంగంలోని చట్టాలను ఉల్లంఘించిన వారికి జైలు శిక్ష తప్పనిసరి."
-డాక్టర్ విల్లీ ఫు కిన్ చి, హాంకాంగ్ లీగల్ ఎక్స్ఛేంజ్ ఫౌండేషన్ సెక్రటరీ జనరల్.
వీలైనంత త్వరగా ఆందోళనలను విరమించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని అక్కడి యువతను హెచ్చరించారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టకొని ముందుకు సాగాలని... ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని నిపుణులు సూచించారు.
"ఆర్టికల్ 15 వైమానిక భద్రతా ఉత్తర్వుల ప్రకారం విమానాశ్రయాలలో ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడినా, ప్రాణనష్టం కలిగించినా, గాయపరిచినా శిక్ష జీవితఖైదే."
- ఆల్బర్ట్ వు , హాంకాంగ్ హైకోర్టు న్యాయవాది.
నిరసనకారులను చెదరగొట్టే క్రమంలో 180 మంది పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడ్డారని, హాంకాంగ్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ (హెచ్‌కెఎస్‌ఎఆర్) ఒక ప్రకటనలో తెలిపింది. నిరసనకారులు శాంతియుతంగా వారి మనోభావాలను తెలియజేయాలని, హింసను విడనాడాలని కోరారు. అప్పుడే హాంగ్‌కాంగ్ పూర్వస్థితికి వస్తుందని హెచ్‌కెఎస్‌ఎఆర్ ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి: ట్రంప్‌తో ఫోన్లో సంభాషించిన మోదీ